శ్రీకాళహస్తిలో పవన్ టూర్-టార్గెట్ అంజూ యాదవ్-టెన్షన్, టెన్షన్..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు ముదురుతోంది. ఈ క్రమంలో విపక్షాల్ని టార్గెట్ చేసేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా శ్రీకాళహస్తికి చెందిన మహిళా సీఐ అంజూ యాదవ్ బహిరంగంగా ఓ జనసేన నేతపై దాడి చేయడం కలకలం రేపింది. దీనిపై ఇవాళ తాడోపేడో తేల్చుకునేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ శ్రీకాళహస్తిలో పర్యటిస్తున్నారు.

ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి తిరుపతి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తికి రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. తాజాగా రాష్ట్రంలో వాలంటీర్లపై పవన్ విమర్శలు చేస్తున్న క్రమంలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్దితులు తలెత్తుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోనూ పవన్ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో జనసేన కార్యకర్తలు కూడా పోటీ నిరసన చేశారు. ఈ సమయంలో మహిళా సీఐ అంజూ యాదవ్ కొట్టే సాయి అనే జనసేన కార్యకర్తపై చేయిచేసుకున్నారు.
పోలీసు స్టేషన్ బయట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కొట్టేసాయి రెండు చెంపల్ని బహిరంగంగానే ఆమె వాయించారు. దీనిపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఐ వెనక్కి తగ్గారు. అయితే ఈ ఘటన జనసేనలోనూ తీవ్ర చర్చనీయాంశం కావడంతో పవన్ కళ్యాణ్ ఆమెపై ప్రైవేటు కేసు పెట్టడం లేదా నిరసన తెలపడం చేసేందుకు శ్రీకాళహస్తి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంజూ యాదవ్ పై శ్రీకాళహస్తి వెళ్లే తేల్చుకుంటానని పవన్ తాజాగా ప్రకటించారు.
అన్నట్లుగానే ఇవాళ అంజూ యాదవ్ తీరుపై నిరసన తెలిపేందుకు పవన్ శ్రీకాళహస్తికి చేరుకున్నారు. మరోవైపు అంజూ యాదవ్ దాడి ఘటనపై ఉన్నతాధికారులు పవన్ టూర్ కు ముందే చర్యలు తీసుకుంటారని ప్రచారం సాగినా అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. అంజూ దాడిపై ఆమెకు మెమో జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరి సరిపెట్టారు. దీంతో పవన్ ఇవాళ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాళహస్తి టూర్ లో పవన్ తీసుకునే నిర్ణయం కోసం జనసేన కార్యకర్తలు కూడా ఎదురుచూస్తున్నారు. పవన్ టూర్ నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications