శబరిమల భక్తులకు బిగ్ అప్డేట్ - ఆ పాస్ లు నిలిపివేత..!!
శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు కీలక సమాచారం. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు ముఖ్య మైన ప్రకటన చేసింది. అయ్యప్ప దర్శనం కోసం అటవీ మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులకు జారీ చేసే ప్రత్యేక పాస్ లు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించింది. వర్చ్యువల్ క్యూ లైన్ .. స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చే భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
శబరిమల ఆలయ నిర్ణయం
అయ్యప్ప భక్తులకు శబరిమల ఆలయ బోర్డు కీలక సూచన చేసింది. శబరిమలకు అటవీ మార్గంలో నడిచివెళ్లే 5 వేల మంది భక్తులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేసేందుకు అధికారులు ఇటీవ లే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అయితే అటవీ మార్గం నుంచి వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యం గా అయిదు రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక పాస్‌ల జారీపై ఆంక్షలు విధించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రత్యేక పాస్‌లు జారీ చేయకూడదని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) స్పష్టం చేసింది. కాగా, అటవీమార్గంలో నడిచి వెళ్లే వారికి వెంటనే దర్శనం ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

పాసులు రద్దు
అయ్యప్ప దర్శనం కోసం అటవీ మార్గాల ద్వారా నడిచి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లను గత నెలలో ఖరారు చేశారు. వీరి కోసం దర్శనం కోసం ప్రత్యేక క్యూ సహా అటవీ శాఖ జారీ చేసిన ప్రత్యేక ట్యాగ్‌లను అందించారు. అయితే, పెరుగుతున్న రద్దీ కారణంగా ఈ ప్రత్యేక పాస్‌లను నిలిపివేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు వెల్లడించింది. మండల పూజ సీజన్ ముగిసిన తర్వాత డిసెంబరు 26న మూసివేసిన శబరిమల ఆలయాన్ని తిరిగి తెరిచారు. మళ్లీ డిసెంబర్ 30న మకరవిళక్కు ఉత్సవాల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోవటం తో భక్తుల రద్దీ పెరిగింది.
మకరజ్యోతి వేళ
జనవరి 14వ తేదీన శబరిమలలో మకరవిళక్కు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 14వ తేదీన శబరిమల కొండపై అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ ప్రత్యేక ఘట్టానికి దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాల నుంచి కూడా భక్తులు ఏటా పెద్ద సంఖ్యలో హాజరు అవుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారనే అంచనాలతో ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో చోటు చేసుకున్న అనుభవాలతో ఆలయ పాలకవర్గం ఈ సారి ముందుగానే అన్ని విభాగాలతో ఏర్పాట్ల పైన సమీక్ష చేసింది. ముందుగానే భద్రత... భక్తుల క్యూ లైన్లు.. జ్యోతి దర్శనం వేళ తీసుకోవాల్సిన చర్యల పైన నిర్ణయాలు తీసుకుంది.












Click it and Unblock the Notifications