19 మున్సిపాల్టీల్లో నామినేషన్ల గడువు పెంపు పై సుప్రీం అసలు ఏం చెప్పింది..!?
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. తమకు 19 మున్సిపాల్టీల్లో నామినేషన్లకు అవకాశం ఇవ్వలేదని వైసీపీ సుప్రీంని ఆశ్రయించింది. ఈ పిటీషన్ పైన విచారణ తరువాత సుప్రీం రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ అభ్యంతరాలు.. నామినేషన్ దాఖలు.. శాంతి భద్రతల పైన స్పష్టత ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు సుప్రీం ఆదేశాల విషయంలో వైసీపీ.. టీడీపీ వాదనలు వినిపిస్తున్నాయి. అటు ఎన్నికల సంఘం సుప్రీం ఆదేశాల అమలు విషయంలో కసరత్తు చేస్తోంది.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న ఘటనల పై వైసీపీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. నాటి ఘటనల ను వైసీపీ తరపున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పలు విషయాలను ప్రస్తావించారు. దాదాపు 63 శాతం మంతి వైసీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయితే, ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గీ, సిద్దార్ధ లూద్రా వాదనలు వినిపించారు.

వాదనల తరువాత సుప్రీం కోర్టు వైసీపీ అభ్యంతరాలు లేవనెత్తిన చోట్ల...వారి ఫిర్యాదులను మరో సారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసికి సుప్రీం సూచన చేసింది. పోటీ చేసే అభ్యర్ధులకు భద్రత కల్పించాలని ఆదేశించింది. ఈ నెల 25వ తేదీ వరకు పోటీ అభ్యర్ధుల జాబితా ప్రకటించవద్దని.. 27వ తేదీన తీసుకున్న చర్యల పైన పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
అయితే, నామినేషన్ గడువు పొడిగించాలని సుప్రీం ఆదేశాలు ఇవ్వలేదని.. పరిశీలించాలని ఎన్నికల సంఘానికి సూచన చేసిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్ధులు ఎక్కడ నామినేషన్లు వేయలేకపోయారో పరిశీలన చేయాలని సూచించినట్లు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా ఫిర్యాదులు వచ్చిన చోట మళ్లీ నామినేషన్లు తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని ఎస్ఈసీ నిర్ణయానికే వదిలివేసారని చెబుతున్నారు.
ఎన్నికల నామినేషన్లు సహా, నిర్వహణ వరకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని టీడీపీ నేతలు వివరిస్తున్నారు. కాగా.. వైసీపీ ఫిర్యాదు చేసిన 19 మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ వేళ చోటు చేసుకున్న పరిణామాలు... ఫిర్యాదుల పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠ పోలీసు, రెవిన్యూ అధికారులతో సమావేశం అయ్యారు. సుప్రీం ఆదేశాల పైనా చర్చిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.














Click it and Unblock the Notifications
