YSRCPపై యుద్ధాన్ని ప్రకటించిన TDP?
తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు ప్రజల్లో పార్టీ పునాదులను పటిష్టపరచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అధిష్టానం రూపొందించింది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యపై ప్రభుత్వాన్ని ఇక్కట్లకు గురిచేయడంతోపాటు ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని భావిస్తోంది.

విశాఖపై టీడీపీ దృష్టి
అధికార ప్రభుత్వం పదే పదే విశాఖపట్నం నుంచి పరిపాలన అంటుండటంతోపాటు వైసీపీకి చెందిన సీనియర్ నేతలంతా ఉత్తరాంధ్రపై దృష్టిపెట్టడంతో మొదటగా అక్కడినుంచే పోరుబాట పట్టాలని నిర్ణయించింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంద్వారా తాను బలోపేతం కావాలని భావిస్తోంది. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావుతో టీమ్ ఏర్పాటైంది. తాను చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి ఇతర నాయకులు, కార్యకర్తలను వీరు కలుపుకువెళ్లాలి.

28 నుంచి పోరుబాటకు శ్రీకారం
ఈనెల 28వ తేదీ నుంచి ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది. ఈనెల 28వ తేదీన రిషికొండను తవ్వేయడంపై, 29వ తేదీన దసపల్లా భూములపై, 30వ తేదీన అరకులోయలో గంజాయిసాగు, నవంబరు ఒకటోతేదీన అనకాపల్లిలో చక్కెర కర్మాగారాలను మూసేయడంపై, 3వ తేదీన హిర మండలం దగ్గర గొట్ట బ్యారేజ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై పోరుబాట పడుతున్నారు. అమరావతి రైతులు అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో 60 రోజులపాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్ర ప్రారంభించినప్పటి నుంచి మంత్రులు, ఉత్తరాంధ్రకు చెందిన నాయకుల వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

తాత్కాలికంగా పాదయాత్ర వాయిదా
యాత్రకు ఆటంకాలేర్పడటం, కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా యాత్రను వాయిదా వేశారు. ఈ యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి క్రమంలో మూడు రాజధానులకు అనుకూలురు, అమరావతి రైతులు మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదముందని అంచనా వేశారు. అయితే యాత్రను రైతులు తాత్కాలికంగా విరమించినప్పటికీ తర్వాత సాగించినా వాతవరణం ఉద్రిక్తంగా మారే అవకాశంఉందని భావిస్తున్నారు. దీన్ని చక్కదిద్దే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని రైతులు అంటున్నారు.












Click it and Unblock the Notifications