అదుపు తప్పుతోంది, ఇక నుంచి - అధినేతల అనూహ్య నిర్ణయం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేసారు. ఇటు కూటమి పార్టీల్లో చేరికల పైన మూడు పార్టీల్లో కొత్త చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పైన సర్వేలు.. నివేదికలు వ్యతిరేకంగా వస్తున్నాయి. దీంతో.. కూటమి పార్టీల అధినేతలు అప్రమత్తం అయ్యారు. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
కూటమి పార్టీల అధినేతలు ఒకే సమయంలో తమ కేడర్ కు కీలక ఆదేశాలు ఇచ్చారు. తాజాగా జరిగిన మహానాడు లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలో కోవర్టులు ఉన్నారని..తమ అజెండా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పార్టీలో వైసీపీ నేతల చేరికల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. పవన్ సైతం తమ పార్టీ ఎమ్మెల్యేల పని తీరు పైన సర్వేకు నిర్ణయించారు. ఇక.. పార్టీలో చేరికల ద్వారా వస్తున్న సమస్యల పైన అప్రమత్తమైన టీడీపీ అధి నాయకత్వం తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనికి ముందే జనసేన తమ పార్టీ నేతలు ఎవరు లైన్ దాటినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

తాజాగా టీడీపీ అధినాయకత్వం పార్టీలో చేరికల పైన కీలక ప్రకటన చేసింది. పార్టీలో చేరికల విషయంలో వారి గురించి పార్టీ కేంద్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఆదేశించారు. వారి గురించి పార్టీ పూర్తిగా విచారణ చేసిన తరువాత చేరికలను ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని పార్టీలోని అన్ని హోదాల్లో ఉన్న నాయకులు గుర్తించాలని స్పష్టం చేసారు. దీని ద్వారా నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న చేరికల ద్వారా కూటమి నేతల మధ్య బేదాభిప్రాయాలు వస్తున్నట్లు గుర్తించారు. గతంలో కూటమి పార్టీలకు వ్యతిరేకంగా పని చేసిన వారికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అవకాశం ఇవ్వటం పైన క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది.
అదే విధంగా రెండు పార్టీల్లోని కొందరు నేతలు మితి మీరిన స్వేఛ్చతో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు, పవన్ గుర్తించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పైన వస్తున్న విమర్శల పైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఒన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయేలా వ్యవహార శైలి ఉండకూడదని పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టం చేసారు. ఈ వారంలోనే కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఆ తరువాత చంద్రబాబు - పవన్ భేటీ అయి.. ఏడాది పాలన పైన సమీక్ష... భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications