'బాహుబలి' కోసం జగన్, చంద్రబాబు అన్వేషణ
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండు పార్టీలకు ఒకటే ఆప్షన్ ఉంది. అది గెలుపు. ఏపీలో 2029లో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఆ పార్టీ ముందుగా ప్రతిపక్షాన్ని బలహీనపరిచి తర్వాత అధికార పక్షాన్ని ఓడిస్తుంది. దీంతో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఇరు పార్టీలది.

సొంత పార్టీలో కేశినేని అసమ్మతి గళం
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులను మార్పు చేయబోతున్నాయి. ఈ విషయాన్ని ఇరునేతలు ముందే చెప్పేశారు. కాకపోతే అవి ఏ నియోజకవర్గాలన్నది వెల్లడించలేదు. కేశినేని నాని విజయవాడ ఎంపీగా టీడీపీలో ఉన్నప్పటికీ సొంతపార్టీలోనే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. అధినేతపై మాటల దాడి చేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి తమ పార్టీ తరఫున లగడపాటి రాజగోపాల్ ను బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అతనికన్నా బలమైన అభ్యర్థిని వైసీపీ తరఫున బరిలోకి దింపడానికి సన్నాహాలు ప్రారంభించింది.

పీవీపీని పక్కన పెట్టినట్లే?
ఆర్థిక బలం, అంగబలం ఉన్న వ్యక్తుల కోసం అన్వేషిస్తోంది. తనకు సీటివ్వాలని, కావాలంటే రూ.200 కోట్లవరకైనా తాను ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని పీవీపీ చెబుతున్నప్పటికీ అధిష్టానం ఆయన్ను పక్కన పెడుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన సంగతి తెలిసిందే. నాగార్జున పోటీచేయబోతున్నారంటూ వార్తలు రావడంతో ఆయన వాటిని ఖండించారు. వైసీపీ చివరి నిముషంలో ఎవరిని బరిలోకి దింపుతుందో అనే ఆసక్తి నెలకొంది.

ఆత్మకూరు నుంచి రామనారాయణరెడ్డి?
అలాగే నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంది. దీన్ని బద్దలు కొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకొని నెల్లూరు ఎంపీగా నిలబెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆనం దీనికి అంగీకరిస్తే సరి.. లేదంటే ఆత్మకూరు సీటు కేటాయించబోతున్నారు. అదే జరిగితే ఆనంను ఢీకొట్టడానికి మేకపాటి వర్గం కంటే బలమైన బలమైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తోంది. ఇలా ఏ పార్టీ బలమైన అభ్యర్థిని నిలబెడితే అంతకంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్థిక బలం, అంగ బలం పుష్కలంగా ఉన్న బాహుబలుల కోసం అన్వేషిస్తున్నాయి. ఇరు పార్టీల అంతిమ లక్ష్యం ఒక్కటే.. విజయం సాధించడం.












Click it and Unblock the Notifications