రెండు కీలక నియోజకవర్గాలకు అభ్యర్దులు ఖరారు చేసిన చంద్రబాబు..!!
ఏపీలో రానున్న ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. ఈ సమయంలో అభ్యర్దుల ఎంపిక పైన పార్టీ అధినేత చంద్రబాబు ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తున్న సమయంలో పార్టీ అభ్యర్దులు పోటీ చేసే స్థానాలను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా రెండు కీలకమైన నియోకవర్గాలకు తాజాగా పార్టీ నాయకత్వం ఇంఛార్జ్ లను ఖరారు చేసింది.
చంద్రబాబు నిర్ణయాలు : ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాల పర్యటనల్లో ఉన్న చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఖరారు పైన సర్వే నివేదికల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. గెలుపే ప్రామణికంగా అభ్యర్దుల ఖరారు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా, బీజేపీతో వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. పొత్తుల పైన అధికారిక ప్రకటన వచ్చే లోగా ముందుగా నియోజకవర్గ ఇంఛార్జ్ లను నియమిస్తున్నారు. సీట్ల ఖరారు సమయంలో మార్పులు చేర్పులు జరిగితే మినహా వారే అభ్యర్దులుగా బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో నిర్ణయం పార్టీ ప్రకటించింది.

రెండు నియోజకవర్గాల్లో : అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. కడప, గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాలను ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‍ఛార్జిగా మాధవీరెడ్డి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‍ఛార్జిగా రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజనేయులును నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు వెల్లడించారు. కడప జిల్లాపైన టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కడప అసెంబ్లీ నుంచి పలువురు టీడీపీ సీటు ఆశిస్తున్నారు.1999 తరువాత కడప సీటు ఇప్పటి వరకు టీడీపీ గెలవలేదు. వైసీపీ నుంచి ప్రస్తుత డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మాధవీరెడ్డిని పార్టీ ఇంఛార్జ్ గా నియమించారు.

సుచరితపై మాజీ ఐఏఎస్ పోటీ : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీటు నుంచి మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2014లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన రావెల కిశోర్ బాబు మంత్రిగా పని చేసారు. తరువాత మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోవటంతో పార్టీ మారారు.
2019 ఎన్నికల్లొ సుచరిత గెలుపొందారు. అక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఐఏఎస్ రామాజంనేయులు కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబును పలుమార్లు కలిసారు. ఆయనకు ప్రత్తిపాడు నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. అందులో భాగంగా ఇప్పుడు అధికారికంగా ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా రామాంజనేయులను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో, ఈ రెండు స్థానాలకు దాదాపు అభ్యర్దులుగా వీరే బరిలో ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications