పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రత్యర్థిని ఫిక్స్ చేసిన టీడీపీ- అక్కడే అసలు ట్విస్ట్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల వేళ కూటమి - వైసీపీ మధ్య రాజకీయంగా కొత్త నిర్ణయాలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల పైన టీడీపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు లో టీడీపీ ఇంఛార్జ్ ను ఖరారు చేసింది. అక్కడే అసలు ట్విస్ట్ తెర మీదకు వస్తోంది.
టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియెజకవర్గాల పైన పార్టీ నాయకత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించిన టీడీపీ.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పై గురి పెట్టింది. అందులో భాగంగా కొద్ది రోజులుగా చర్చగా మారిన పుంగనూరు నియోజవర్గ తెలుగుదేశం పార్టీ నూతన ఇన్‌చార్జిగా వై.మధుసూదన్‌నాయుడు ను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటన చేసారు. సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ మేటిమందకు చెందిన మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు కుమారుడైన ఈయన మంత్రి లోకేశ్‌కు సన్నిహితంగా ఉంటున్నారు. కాగా, శాసనసభ ఎన్నికలకు ముందు రొంపిచెర్లకు చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డిని ఇన్‌చార్జిగా, తర్వాత పుంగనూరు అభ్యర్థిగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కేవలం 5 వేల ఓట్లతో పుంగనూరు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన ఓటమి చెందారు.

మారుతున్న పుంగనూరు రాజకీయం
కాగా, ఏడాదిపాటు వైసీపీ నేతలు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని నియోజకవర్గంలో పర్యటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పుంగనూరు కౌన్సిలర్లు, పులిచెర్ల జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు పలువురు నాయకులను టీడీపీలో చేర్చుకున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. మరో వైపు చల్లా రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థివర్గం పావులు కదిపింది. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిసి పుంగనూరులో టీడీపీని కాపాడాలని చర్చించారు. నియోజకవర్గంలో కొందరు చేసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు చేస్తూ.. వారికి చల్లా సహకారం ఉందని ఆరోపించారు. మంత్రుల సమక్షం లోనే టీడీపీ సమావేశంలో ఘర్షణల పైనా నివేదికలు వెళ్లాయి. దీంతో, పలువురు నేతలు ఇన్‌చార్జి పదవికి ప్రయత్నించినా మధుసూదన్ నాయుడు వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపారు. అయితే, చల్లాబాబు మద్దతు దారులు మాత్రం ఈ నిర్ణయం పైన ఆగ్రహంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications