బీజేపీతో పొత్తుపై మారిన చంద్రబాబు వ్యూహం - ఢిల్లీకి కీలక ప్రతిపాదన..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం జగన్ ఇంఛార్జ్ ల మార్పులో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు టీడీపీ, జనసేన జగన్ ఓటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీలో టికెట్ దక్కక ఆగ్రహంతో ఉన్నవారిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలోనే టీడీపీ, బీజేపీ పొత్తులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు బీజేపీకి చేసిన ప్రతిపాదన ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
పొత్తుల లెక్కలు: ఏపీలో పొత్తులపైన బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. టీడీపీ, జనసేనతో పొత్తుతో వెళ్లాలా...ఒంటరిగా వెళ్లాలా అనే అంశం పైన ఏపీ పార్టీ కోర్ కమిటీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. జనసేన తమకు మిత్రపక్షంగా ఉంటూ టీడీపీతో కలవటం పైన బీజేపీ ఆచితూచి స్పందిస్తోంది. ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుతో వెళ్లాలని బీజేపీ మెజార్టీ నేతలు సూచించారు.

ఈ సమయంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ చర్చించి పొత్తుపైన సిఫార్సు చేయనుంది. ప్రధాని మోదీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పొత్తు అంశం పైన రెండు పార్టీలకు చెందిన మధ్యవర్తుల వద్ద సీట్ల అంశం ఇప్పటికే ప్రతిపాదనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు బీజేపీకి కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ తాజా ప్రతిపాదన: బీజేపీ తో పొత్తు పైన ఇప్పటి వరకు టీడీపీ, జనసేన వేచి చూసే ధోరణితో ఉన్నారు. బీజేపీ నుంచి ఈ మేరకు ప్రస్తుతం నిర్ణయం దిశగా కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తు పైన సానుకూల ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల్లో బీజేపీతో కలిసేందుకు టీడీపీలోని ముఖ్య నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
బీజేపీ పైన ఏపీలో వ్యతిరేకత ఉందని..ఈ సమయంలో ఆ పార్టీతో పొత్తుతో వెళ్తే కొన్ని వర్గాలు దూరంగా ఉండే అవకాశం ఉందనే చర్చ టీడీపీలో మొదలైంది. దీంతో..ఎన్నికల్లో పొత్తు కంటే ఎన్నికల అనంతరం ఎన్డీఏలో చేరుతామని తాజాగా టీడీపీ, జనసేన నుంచి బీజేపీ నేతలకు ప్రతిపాదించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.

బీజేపీ నిర్ణయం ఏంటి: దీని పైన బీజేపీ నేతల స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల మేనేజ్ మెంట్ లో జగన్ ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం అవసరమని ఇప్పటి వరకు టీడీపీ, జనసేన అధినేతలు భావిస్తూ వచ్చారు. కానీ, తాజా సర్వేల్లో బీజేపీతో కలిస్తే నష్టం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఫలితంగా ఎన్నికల తరువాత కలుస్తామని నచ్చ చెప్పి..తమ వైపే బీజేపీ మద్దతుగా నిలిచేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. బీజేపీ నాయకత్వం ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్న ప్రతిపాదనకు అంగీకరిస్తుందా.. లేదా అనేది వేచి చూడాలి. టీడీపీ పొత్తు వ్యవహారంలో అంతిమంగా ప్రధాని మోదీ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications