భార్యాబిడ్డలతో ఊర్లొదిలి పారిపోండి: విజయవాడకు ఎవడు వచ్చినా రాళ్లతో కొడతాం: మాస్ వార్నింగ్
Buddha Venkanna: రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులు చోటు చేసుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు అనేక చోట్ల ధ్వంసం అయ్యాయి.
అదే సమయంలో- తాజాగా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాలు టీడీపీ- వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వాగ్వివాదాలకు దారి తీసింది. పరస్పరం హెచ్చరికలను జారీ చేసుకోవడానికి కారణమైంది.

తాజాగా- విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు- ఎమ్మెల్యేలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వాళ్లందరూ భార్యా బిడ్డలను తీసుకుని ఊర్లొదిలి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. తక్షణమే జిల్లాను వదిలి వెళ్లాలని అన్నారు.
విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దాడులు చేయొద్దని చెబుతున్నారని, వారి మాటలను గౌరవించినా వైసీపీ నాయకులు ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించారు. ఊర్లొదిలి పారిపోవడానికి తాము ఇప్పటికే టైమ్ ఇచ్చామని, అది దాటిపోయిందని చెప్పారు.
కొడాలి నాని పరువు తీసిన బుద్దా వెంకన్న#kodalinani #BuddhaVenkanna #Andrapradesh #ysrcp #tdp #chotanews pic.twitter.com/bXJUnKVtvd
— ChotaNews (@ChotaNewsTelugu) June 22, 2024
ఎవడు చంద్రబాబును విమర్శించినా చూస్తూ ఊరుకోబోమని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. నేను ఓపెన్‌గా చెబుతున్నా. ఇది రాజధాని. విజయవాడకు రాకుండా ఎవడూ ఉండడు. చంద్రబాబుపై పిచ్చి, పిచ్చి వాగుడు వాగిన వాళ్లు ఎవడు విజయవాడకు వచ్చినా వదలిపెట్టం.. అని బుద్ధా వెంకన్న తేల్చి చెప్పారు.
వైఎస్ఆర్సీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్‌ను ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. వారికి కరించేంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై పిచ్చి వాగుడు వాగితే రాళ్లు తీసుకుని కొడతామని హెచ్చరించారు. విజయవాడలో బుద్ధా వెంకన్న అనే చంద్రబాబు సైనికుడు ఉన్నాడని గుర్తుంచుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications