మంగళగిరి పసుపుమయం..!!
అమరావతి: ఏపీలో శాసన మండలి (MLC elections in AP) ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP) మరో ఘన విజయాన్ని సాధించింది. పట్టభద్ర నియోజకవర్గాల్లో ఎదురైన ఫలితాలనే ఇక్కడా అందుకుంది. ఓటమి తప్పదనుకున్న దశ నుంచీ గెలుపు బాట పట్టిందా పార్టీ. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పరాజయాన్ని పరిచయం చేసింది. సాంకేతికపరంగా బలం లేనప్పటికీ- తన అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. క్రాస్ ఓటింగ్ జరగడం ద్వారా విజయాన్ని అందుకోగలిగింది.
తిరుగులేని విజయం..
పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో సాధించిన తిరుగులేని విజయాన్ని ఎమ్మెల్యే కోటాలోనూ పునరావృతం చేసింది టీడీపీ. మొత్తంగా నాలుగు స్థానాలను తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇవి ఆ పార్టీకి ఊహించని విజయాలే. వైఎస్ఆర్సీపీ తన స్థాయి, బలానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ- ఏడో అభ్యర్థి ఓడిపోవడం అనేది మింగుడుపడని అంశం. ఏడో అభ్యర్థిగా కోలా గురువులు పరాజయం పాలయ్యారు.
నాలుగింట్లో..
మొత్తంగా 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే కోటా-7, స్థానిక సంస్థలు-9, ఉపాధ్యాయ స్థానాలు-2, పట్టభద్ర నియోజకవర్గాలు-3 ఉన్నాయి. ఈ 21 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన అభ్యర్థులు 17 చోట్ల ఘన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నాలుగు చోట్ల గెలిచింది. పట్టభద్ర స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. తాజాగా ఎమ్మెల్యే కోటాలో తిరుగుబాటు శాసన సభ్యులు ఉన్నప్పటికీ తనకు దక్కాల్సిన స్థానాన్ని దక్కించుకోగలిగింది.
మంగళగిరిలో టీడీపీ సంబరాలు..!!#TDP #MLCElectionsInAP #MLCElections #ApMLCElections #AndhraPradesh #OneIndiaTelugu pic.twitter.com/Kf6520FMsm
— oneindiatelugu (@oneindiatelugu) March 23, 2023
పార్టీలో జోష్..
ఇది ఆ పార్టీలో జోష్ నింపింది. పంచుమర్తి అనురాధ విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన వెంటనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. టీడీపీ జెండాలను తగిలించుకుని, కార్లు, బైక్ లతో పెద్ద సంఖ్యలో వారు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జెండాలను ఎగురవేశారు. రంగులు చల్లుకున్నారు. బాణాసంచాను కాల్చుతూ సందడి చేశారు. మంగళగిరి మొత్తం పసుపుమయమైంది.

క్యాడర్ కు థ్యాంక్స్..
2019 తరువాత ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసి ఉండటంతో- రాకరాక దక్కిన ఈ విజయాలను వారు ఘనంగా జరుపుకొన్నారు. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు క్యాడర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించారు. వైసీపీ పతనానికి నాంది పలికామని అన్నారు. అటు నారా లోకేష్ కూడా ఈ విజయం పట్ల స్పందించారు. కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications