ఎపి:అభ్యర్థుల పేర్లు ముందే వెల్లడిస్తున్న చంద్రబాబు...టిడిపి శ్రేణుల్లో విస్మయం!
అమరావతి:తమ పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ఆలస్యంగా, ఇంకా ఆలస్యంగా...అనేక సందర్భాల్లో చివరి క్షణాల్లోనూ ప్రకటించే టిడిపి అధినేత చంద్రబాబు తన సహజసిద్ద వైఖరికి భిన్నంగా ఈసారి కొందరు అభ్యర్థుల పేర్లను ముందుగా, ఇంకా ముందుగా...చాలా మందుగా కూడా ప్రకటించేస్తున్నారు.
అలా చంద్రబాబు తాజాగా సాలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్‌చార్జి ఆర్‌పీ భంజ్‌దేవ్‌ను ప్రకటించడమే ఒక ఆశ్చర్యమనుకుంటే...కురుపాం నియోజకవర్గంలో పోటీ చేసే పార్టీ అభ్యర్థిపై కూడా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి శత్రుచర్ల సతీమణి శశికళా దేవి పోటీ చేస్తారని ఆయన అమరావతిలో ప్రకటించారు. దీంతో మారిన అధినేత చంద్రబాబు వైఖరి టిడిపి శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

సాలూరు అభ్యర్థి...భంజ్ దేవ్
విజయనగరం జిల్లా సాలూరుకు తొలుత టిడిపి ఇన్‌చార్జిగా భంజ్‌దేవ్‌ను సీఎం ప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబు అనంతరం అదే నియోజక వర్గానికి చెందిన పలువురు నేతలతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో భంజ్‌దేవ్ టీడీపీ అభ్యర్థి అని చెప్పి గెలిపించే బాధ్యత అందరూ భుజాలపై వేసుకోవాలని వారిని ఆదేశించారు. నియోజకవర్గ టీడీపీ నేతలతో ముఖాముఖి మాట్లాడేందుకు సీఎం క్యాంప్ ఆఫీసుకు రావాలని రెండు రోజుల కిందట అధినేత వారికి కబురు పంపారు.

అధినేతే...లైన్ క్లియర్ చేశారు
ఈమేరకు సుమారు 120మంది నాయకులు అక్కడి నుంచి తరలి అమరావతి రాగా సిఎం చంద్రబాబు వారితో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి, భంజ్‌దేవ్, నాలుగు మండలాలు, పట్టణానికి చెందిన ముఖ్యనాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, యూత్‌లీడర్స్, పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు, ఇన్‌చార్జి మంత్రులతో సీఎం చంద్రబాబే స్వయంగా మాట్లాడారు. ముఖ్య నాయకుల అభిప్రాయాలను సేకరించారు. చివరకు భంజ్‌దేవ్‌ను అభ్యర్థిగా ప్రకటించేశారు.
ఇదే సీటు కోసం పోటీలో ఉన్న ఎమ్మెల్సీ సంధ్యారాణి మరో మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు కాబట్టి ఆమెను ఆ పదవికి పోటీ నుంచి తప్పించారు.

అక్కడి నేతలకు...స్వయంగా చెప్పే శారు
అంతేకాదు జడ్పీ చైర్‌పర్సన్ స్వాతీరాణి కూడా ఈసారి సీటు కోసం పోటీలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో సిఎం అసలు ఆమె పేరునే అభ్యర్థి ఎంపిక సందర్భంగా చర్చకు పెట్టనందున ఇక ఆమె గురించి ప్రస్తావనే రాలేదు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న సంధ్యారాణికి సీటు ఇచ్చే కంటే భంజ్‌దేవ్‌కు ఇవ్వడం మంచిదని అక్కడి మండలాల నాయకులు మద్దతు పలికిన నేపథ్యంలో సిఎం చంద్రబాబు భంజ్‌దేవ్‌కు సీటు ప్రకటించారని, ఆ వెంటనే సమావేశానికి హాజరైన నాయకులంతా హర్షం వ్యక్తంచేస్తూ భంజ్‌దేవ్‌కు అభినందనల వర్షం కురిపించారని తెలిసింది. కాగా ఇదే సందర్భంలో భంజ్‌దేవ్ సిఎంతో మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో జడ్పీచైర్‌పర్సన్ వేలు పెడుతున్నట్లు ప్రస్తావించడంతో సీఎం జోక్యం చేసుకుంటూ మూడో వ్యక్తి ఆ నియోజకవర్గం వైపు చూడొద్దని స్పష్టంగా చెప్పారట.

కురుపాం అభ్యర్థిగా...శశికళ
అలాగే కురుపాం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిపై కూడా పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి శత్రుచర్ల సతీమణి శశికళా దేవి పోటీ చేస్తారని అమరావతిలో ప్రకటించారు. సాలూరుతో పాటు కురుపాం నియోజకవర్గం నాయకులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయిన ఆయన కురుపాం నియోజకవర్గానికి శశికళాదేవిని ప్రస్తుతానికి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఇన్‌చార్జిగా ఉన్నజనార్థన థాట్రాజ్ క్రియాశీలకంగా వ్యవహరించలేక పోవటంతో ఆయనను పక్కన పెట్టి శశికళకు బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఈమెకు పార్టీ బాధ్యతలు అప్పగించి నియోజక వర్గంలోని నాయకత్వాన్ని పటిష్ట పర్చుకోవాలని చంద్రబాబు భావనగా తెలిసింది. అయితే చంద్రబాబు ఇంతముందుగా అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాంశం అయింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!