బీజేపీకి చంద్రబాబు సీట్ల ఖరారు - ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఇవే..!?
ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవ్వటం ఖాయమైంది. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో 400 సీట్లు గెలవటమే లక్ష్యంగా బీజేపీ పాత మిత్రులతో కొత్త పొత్తులకు సిద్దం అవుతోంది. బీజేపీ ఈ సారి ఏపీలో టీడీపీ, జనసేన సహకారంతో సీట్లు గెలవాలని భావిస్తోంది. ఇందు కోసం పెద్ద సంఖ్యలో సీట్లు కోరుతోంది. తాజాగా చంద్రబాబు బీజేపీకి కేటాయించే సీట్ల పైన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసారు.
పొత్తులు - లెక్కలు : ఏపీలో వైసీపీని ఓడించటం కోసం చంద్రబాబు ఏ ఒక్క అవకాశం వదులుకోవటం లేదు. ఇందు కోసం సొంత పార్టీ అభ్యర్దులను సైతం త్యాగాలకు సిద్దం కావాలని పిలుపునిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు దాదాపు 50 సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. జనసేన, టీడీపీ మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. బీజేపీ పొత్తుతో ఇప్పుడు ఆ సీట్ల వ్యవహారంలో మార్పులు చేస్తున్నారు. జనసేన ముందుగా 40 సీట్లు కోరినా..బీజేపీ కలయికతో ఆ సంఖ్య 25కు పరిమితం కానుంది. బీజేపీ 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు కోరుతోంది. అయితే, చంద్రబాబు నుంచి తాజాగా ఆరు ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

బీజేపీకి సీట్లు : బీజేపీ కోరిన స్థానాల పైన కసరత్తు చేసిన చంద్రబాబు..తాజాగా బీజేపీకి కేటాయించే స్థానాల పైన స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా అరకు, విశాఖపట్నం, ఏలూరు లేదా రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, రాజం పేట ఎంపీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది. విశాఖ నుంచి జీవీఎల్ నరసింహారావు, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, విజయవాడ నుంచి సుజనా చౌదరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని చెబుతున్నారు. అదే విధంగా.. 15 ఎమ్మెల్యే స్థానాల పైన నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. అరకు. విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, ఉంగుటూరు/ తాడేపల్లిగూడెం,కైకలూరు, విజయవాడ సెంట్రల్, శ్రీకాళహస్తి, మదనపల్లె, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్, ఒంగోలు, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఉన్నాయని సమాచారం.

ఆశావాహుల్లో టెన్షన్ : బీజేపీకి కేటాయించే ఈ ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో పలు సీట్లు టీడీపీ ఈ సారి గెలిచే అవకాశం ఉన్నాయనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. రాజమండ్రి నుంచి సోము వీర్రాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూర్యనారాయణ పేర్లు ఇప్పటికే ఖాయమైనట్లు చెబుతున్నారు. ఒంగోలు, విజయవాడ సెంట్రల్ స్థానాల పైన టీడీపీ - జనసేన నుంచి పోటీ ఉంది. ఇప్పుడు ఈ రెండు స్థానాలు బీజేపీకి కేటాయించాలని భావిస్తున్నారు. దీని ద్వారా పొత్తుల్లో భాగంగా బీజేపీ - జనసేనకు 9 ఎంపీ, 40 అసెంబ్లీ స్థానాలు టీడీపీ వదులుకొనేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో..బీజేపీకి కేటాయిస్తున్న సీట్ల పైన టీడీపీ - జనసేనలో ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో తుది నిర్ణయం ఏంటనేది రెండు పార్టీలోనూ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications