కొడాలి నాని ఇలాకాలో చంద్రబాబు - కీలక నిర్ణయం..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. జోనల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు..ఈ నెల 13న గుడివాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ మహానాడు తరువాత గుడివాడలో మినీ మహానాడు నిర్వహణల పైన గతంలోనే కసరత్తు జరిగింది. కానీ, నిర్వహించలేదు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ చంద్రబాబు గుడివాడ పర్యటన రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. అక్కడ జరిగే సభలో చంద్రబాబు తమ పార్టీ అభ్యర్ధిని ప్రకటిస్తారని సమాచారం.
పార్టీ జోనల్ సమావేశాల్లో చంద్రబాబు: టీడీపీ అధినేత చంద్రబాబు జోన్ సమావేశంలో పాల్గొనేందుకు విశాఖ రానున్నారు. పార్టీ నేతలకు ఎన్నికల వేళ కీలక దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు. 12వ తేదీ నుంచి ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. 13న గుడివాడ నియోజకవర్గంలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజు రాత్రికి నిమ్మకూరులో బస చేయనున్నారు.14న మచిలీ పట్నంలో జోనల్ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి దాదాపు 35 నియోకవర్గాలకు చెందిన పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

గుడివాడలో చంద్రబాబు బహిరంగ సభ: 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు తొలి సారి గుడివాడలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు. 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి నాని గెలిచిన తరువాత టీడీపీని టార్గెట్ చేసారు. చంద్రబాబు - లోకేష్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీడీపీ వర్సస్ కొడాలి నాని అన్నట్లుగా గుడివాడ రాజకీయం మారింది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలనేది టీడీపీ లక్ష్యం. ఇందులో భాగంగా అక్కడ టీడీపీ అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దించాలనే అంశం పైన అనేక సర్వేలు చేసారు. స్థానికంగా నేతల మధ్య అనైక్యత పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో, గత కొద్ది నెలలుగా చంద్రబాబు సభ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేసినా..సాధ్య పడలేదు. ఈ సమయంలో ఇప్పుడు చంద్రబాబు గుడివాడలో ఈ నెల 13 బహిరంగసభకు హాజరవుతున్నారు.
టార్గెట్ కొడాలి నాని - అభ్యర్ది ఖరారు: 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ తేదీన గుడివాడలో చంద్రబాబు వరుస కార్యక్రమాల్లో పాల్గొంటారు. హనుమాన్‌జంక్షన్ నుంచి చంద్రబాబు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు గుడివాడ చేరుకుంటారని, అనంతరం రోడ్‌షో నిర్వహిస్తారని, బహిరంగ సభలో ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారైంది. ఈ సభలో చంద్రబాబు నేరుగా కొడాలి నాని లక్ష్యంగా మాట్లాడే అవకాశం ఉంది. పార్టీ అభ్యర్ధి పైనా క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు. తానే అభ్యర్ధి అంటూ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ రావి వేంకటేశ్వర రావు చెబుతున్నారు. అయితే, ఎన్నారై వెనిగళ్ల రాము ఈ సారి టీడీపీ అభ్యర్దిగా బరిలో ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఈ పర్యటనలో అభ్యర్ధిని ప్రకటిస్తారనే అంచనాల నడుమ టీడీపీ నేతలు పోటా పోటీగా గుడివాడలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications