టీడీపీ ప్రకటించిన ఆ అభ్యర్ధుల మార్పు - అసెంబ్లీకి రఘురామ..!!
ఏపీలో ఎన్నికల వేళ కొత్త రాజకీయం మొదలైంది. కూటమి అభ్యర్దుల తుది కసరత్తులో భాగంగా ప్రకటించిన స్థానాల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. చంద్రబాబు ఇప్పటికే తన పార్టీ నుంచి పోటీ చేసే 139 మంది అభ్యర్దులను ప్రకటించారు. ప్రకటించిన వారిలో కొందరిని మార్పు చేస్తున్నారు. బీజేపీ నుంచి సీటు ఆశించి భంగపడిన రఘురామను టీడీపీలో చేర్చుకొని అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్దుల మార్పు
టీడీపీ నుంచి ప్రకటించిన స్థానాల్లో మార్పులు దిశగా కసరత్తు జరుగుతోంది. అనంతపురం జిల్లా మడకశిర(ఎస్సీ) స్థానానికి తొలుత అనిల్ పేరు ప్రకటించారు. కానీ ఆయనతో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం విభేదిస్తోంది. దీంతో ఆ సీటుకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా గజపతినగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు మొదట ప్రకటించారు. కానీ అక్కడ కొన్ని సమస్యలు వచ్చి ప్రచారం ముందుకు నడవడం లేదు. తాజాగా ఈ సీటుకు కళావెంకట్రావును బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇక..నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట (ఎస్సీ) అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ, తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని మార్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది.

తుది కసరత్తు
కర్నూలు జిల్లాలో ఆదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఆ సీటు బదులు ఆలూరు తీసుకోవాలని టీడీపీ నేతలు ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ సుముఖంగా లేదు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి సామాజిక వర్గాన్ని బట్టి ఆలూరులో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని టీడీపీ భావిస్తోంది. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్‌ను ఖరారుచేసింది. ఆదోని అభ్యర్థిత్వం మంత్రాలయంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డే బరిలోకి దిగనున్నారు. కడపకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉండగా తాజాగా జమ్మలమడుగు ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి పేరు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. అనంతపురం లోక్‌సభ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, ప్రొఫెసర్ రాజేశ్, కంబూరి నాగరాజు లో ఒకరి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది.
రఘురామకు అసెంబ్లీ సీటు
ఇక, ఎంపీ రఘురామరాజుకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి రఘురామ నర్సాపురం ఎంపీ సీటు దక్కుతుందని ఆశించారు, కానీ, అక్కడ పార్టీ శ్రీనివాస వర్మ అనే మరో నేతకు అవకాశం కల్పించింది. దీంతో తామే టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలుత విజయనగరం లోక్‌సభ స్థానంలో పోటీచేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. తమ ప్రాంత సామాజిక సమీకరణల రీత్యా పార్టీకి నష్టం చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, రఘురామ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయనను నిలిపే అవకాశం పరిశీలనలో ఉంది. అయితే, ఇప్పటికే అక్కడ అన్ని స్థానాలకు అభ్యర్దులను ప్రకటించారు.












Click it and Unblock the Notifications