వైసీపీ ఎమ్మెల్యేల చేరికకు బ్రేక్, అనర్హతకు చెక్ - చంద్రబాబు రివర్స్ గేమ్..!!
ఏపీలో ఎన్నికల వేళ పార్టీల మార్పు ఊపందుకుంది. వైసీపీలో సీట్లు నిరాకరించిన వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసారు. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనతో టచ్ లోకి వెళ్లారు. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలు సీఎం జగన్, చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొనే అంశం పైన చంద్రబాబు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు.
వ్యూహ ప్రతివ్యూహాలు
వైసీపీలో సీట్లు రాని ఎమ్మెల్యేలు కొందరు టీడీపీతో టచ్ లోకి వెళ్లారు. కానీ, వారిని పార్టీలో చేర్చుకొనే అంశం పైన చంద్రబాబు కొంత కాలం వేచి చూడాలని భావిస్తున్నారు. రాజ్యసభలో ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీల కాలపరిమితి ముగియనుంది. సభలో సంఖ్యాబలం ఆధారంగా మూడు సీట్లు వైసీపీకి దక్కాల్సి ఉంది. దీని ద్వారా రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీంతో, చంద్రబాబు అలర్ట్ అయ్యారు. వైసీపీని పరిస్థితులను తనకు అనుకూలగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో సీట్లు రాని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవటం ద్వారా రాజ్యసభలో ఒక సీటు తాము దక్కించుకొనేలా పావులు కదుపుతున్నారు.

అప్పటి వరకు వేచి చూద్దాం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీకి మద్దతిచ్చిన నలుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసేందుకు వైసీపీ ఫిర్యాదు చేసింది. స్పీకర్ వారికి నోటీసులు జారీ చేసారు. ఆ నలుగురు తమకు 30 రోజుల సమయం కావాలని సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొనే విషయంలోనూ చంద్రబాబు కొత్త వ్యూహం తెర మీదకు తెచ్చారు. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఇప్పుడే చేర్చుకుంటే వారి పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. వారిని అధికారికంగా చేర్చుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని భావిస్తోంది. వారి పైన వైసీపీ అనర్హత వేటు వేస్తే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి పడే ఓట్లు తగ్గిపోతాయి. ఆ ఎన్నికల్లో ఓటు వేసే ఓటర్ల(ఎమ్మెల్యేల) జాబితాను కొద్ది రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించనుంది.

వైసీపీ ప్లాన్ ఏంటి
ఆ జాబితా ప్రకటించిన తర్వాత అందులో ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు. వేసినా వారి ఓటు హక్కును తీసివేయలేరు. ఆ తరువాత వారిని పార్టీలో చేర్చుకోవాలని..ఈ లోగా వారికి హామీ ఇచ్చి వేచి చూడాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. దీని ద్వారా ఎన్నికల ముందు వైసీపీ ముగ్గురు అభ్యర్దులను పోటీకి దించితే, తమ పార్టీ నుంచి ఒక బీసీ అభ్యర్దిని పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. వైసీపీలో టికెట్లు దక్కని వారి మద్దతు, తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో ఒక ఎంపీని గెలిపించుకోవచ్చని లెక్కలు వేస్తున్నారు. దీంతో, నోటీసులు ఇచ్చిన ఎమ్మెల్యే సమాధానాలు పరిశీలించిన తరువాత స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. వైసీపీ నుంచి పార్టీ మారేందుకు సిద్దమైన ఎమ్మెల్యేపై జగన్ నిర్ణయాలు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications