పవన్ కల్యాణ్ హెలికాప్టర్ అడ్డగింత?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి ఉభయ గోదావరి జిల్లాల్లోని సభల్లో పాల్గొంటున్నారు. కూటమికి వస్తున్న ఆదరణను చూడలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పవన్ కల్యాణ్ సభల్లో పాల్గొనకుండా ఉండేందుకు ఆయన హెలికాప్టర్ ను అడ్డుకున్నారని వెల్లడించారు.
అమలాపురం, అంబాజీపేట సభల్లో పాల్గొనేందుకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి పవన్ హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. అయితే ముందుగా ఆ ప్రయాణానికి అధికారులు అడ్డుతగిలారు. హెలికాప్టర్ నడిపేందుకు వచ్చిన కో పైలట్ కు విమానాశ్రయ అనుమతికి సంబంధించిన పర్మిట్ లేదంటూ బయటే ఆపేశారు. దీంతో చంద్రబాబుతో మాట్లాడి ఆయన హెలికాప్టర్ కోపైలట్ ను తీసుకురావడంతో అక్కడి నుంచి పవన్ బయలుదేరి వెళ్లారు. ఇందులో కుట్ర ఉందంటూ చంద్రబాబు ఆరోపించారు.

అదే కో పైలట్ కు బేగంపేట విమానాశ్రయంలో తాత్కాలికంగా అనుమతిచ్చారని, రాజమండ్రి విమానాశ్రయంలో ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అక్కడ లేని నిబంధనలు ఇక్కడ కొత్తగా ఏమైనా ఉన్నాయా? అంటూ నిలదీశారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్పనప్పటికీ చంద్రబాబునాయుడు బయటపెట్టడం విశేషం. పవన్ కల్యాణ్ హెలికాప్టర్ కు గతంలో కూడా ఆర్ అండ్ బీ అధికారులు అడ్డుతగిలారు. హెలిప్యాడ్ విషయంలో అనుమతివ్వడానికి విపరీతమైన ఆలస్యం చేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలకు అడ్డుతగిలేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ జన సైనికులు మండిపడుతున్నారు. పిఠాపురం నుంచి తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పవన్ అక్కడే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే పైలట్, కో పైలెట్ విషయంలో అనవసర నిబంధనలు తెరపైకి తెచ్చి షెడ్యూల్ సరిగా సాగకుండా ఉండేందుకు చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కూటమి అంటేనే భయపడుతున్న వైసీపీ ఈ పనిచేస్తోందంటూ ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు.












Click it and Unblock the Notifications