chandrababu:చంద్రబాబు: ఉత్సాహంతో ఉరకలేస్తూ..
సుదీర్ఘకాలంపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ బెయిల్ ను మంజూరు చేసింది. తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అనారోగ్య కారణాలవల్ల బెయిల్ ఇచ్చేందుకే హైకోర్టు మొగ్గుచూపింది.
తనను అరెస్ట్ చేసే క్రమంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని, కేసు కొట్టేయాలంటూ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టుతోపాటు రాష్ట్ర హైకోర్టులో కూడా ఈ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత కోర్టు తీర్పు రిజర్వు అయింది. ఇంతలో చంద్రబాబు కంటికి ఆపరేషన్ అవసరం కావడంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

బాబుకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని.. ఆయనకు విశ్రాంతి అవసరమని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. దీంతో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వును ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతానికి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించని చంద్రబాబు ఢిల్లీలో తన లాయర్ సిద్ధార్థ లూథ్రా తనయుడి వివాహానికి హాజరయ్యారు.
ఉప రాష్ట్రపతి దన్ ఖడ్ తోపాటు న్యాయవర్గాల నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. వారందరితో చంద్రబాబు ఎంతో హుందాగా గడపడం అందరినీ ఆకట్టుకుంది. రేపటి నుంచి చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి కోర్టు అనుమతులు ఉన్నాయి. దానికన్నా ముందే వ్యక్తిగతంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఎంతో ఉల్లాసంగా కనిపించడం టీడీపీ వర్గాలను సంతోషానికి గురిచేసింది.












Click it and Unblock the Notifications