వివేకా కేసును ప్రజాకోర్టులో పెడతాం
వివేకానందరెడ్డి హత్య కేసును ప్రజాకోర్టులో పెడతామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కడపలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని పోలీసు అధికారులందరికీ ఇది కేస్ స్టడీగా మారిందని, కేసులోని నిందితులే సీబీఐ అధికారులను బెదిరించారన్నారు. వివేకాను గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రౌడీల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. తండ్రిని చంపినవారెవరో తెలుసుకునేందుకు వివేకానందరెడ్డి కుమార్తె పోరాడుతున్నారన్నారు.
రాయలసీమలో ఫ్యాక్షన్‌ను పూర్తిగా అణచివేసింది తెలుగుదేశమేనన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే కడప స్టీల్ ప్లాంట్ పూర్తయ్యేదని, ఎన్నిసార్లు ఆ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు పడతాయో తెలియడంలేదని, టీఏ, డీఏలు కూడా ఇవ్వడంలేదని ఆక్షేపించారు. అన్న క్యాంటిన్, చంద్రన్న భరోసా, విదేశీ విద్య ఏమయ్యాయన్నారు.

సంక్షేమ కార్యక్రమాలకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు స్వర్ణయుగం లాంటిదన్నారు. తాము అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని, 550 టీఎంసీలు తరలిస్తే రాయలసీమ రతనాలసీమగా మారుతుందన్నారు. అప్పర్ భద్ర కడితే శ్రీశైలానికి నీళ్లు రావని, అయినా జగన్ పట్టించుకోరన్నారు. పట్టిసీమ పూర్తిచేయబట్టే రాయలసీమకు 100 టీఎంసీల నీళ్లు వస్తున్నాయి'' అని చంద్రబాబు అన్నారు












Click it and Unblock the Notifications