ఏపీ యూనివర్శిటీల ర్యాంకుల పతనం-కారణమిదేనంటూ చంద్రబాబు ట్వీట్
దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా విశ్వవిద్యాలయాలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్ధలకు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకులు ఇస్తుంది. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా ప్రతిష్టాత్మక సంస్ధలకు ర్యాంకులు కేటాయించింది. అయితే ఇందులో ఎక్కడా ఏపీకి చెందిన యూనివర్శిటీ కానీ, కాలేజీ కానీ మెరుగైన ర్యాంకులు సాధించలేకపోయాయి. అంతేకాదు గతంతో పోలిస్తే వాటి ర్యాంకులు పతనం అవుతూ వస్తున్నాయి. దీనిపై విమర్శలు వచ్చాయి.
ఏపీలో యూనివర్సిటీల ర్యాంకింగ్ పడిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ నివేదికను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల యువత భవిష్యత్ ను తీర్చిదిద్దడంలో కీలకమైన ఉన్నత విద్యా విద్యారంగం నాశనం అయిందని చంద్రబాబు ఆరోపించారు.

నాలుగేళ్లుగా ఏపీ వర్సిటీల ర్యాంకింగ్ పడిపోతున్న సంగతి NIRF నివేదిక ను పరిశీలిస్తే అర్థం అవుతుందని చంద్రబాబు తెలిపారు. 2019లో 29వ ర్యాంక్ లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ నేడు 76వ స్థానానికి పడిపోయిందని గుర్తుచేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కనీసం టాప్ 100 లో స్థానం పొందలేకపోవడం విచారకరమన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకపోవడం, వర్సిటీలను వైఎస్సార్‌సీపీ రాజకీయ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని చంద్రబాబు విమర్శించారు.
మరోవైపు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోని యూనివర్శిటీలు, కాలేజీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో పలు విభాగాల్లో టాప్ 10లో నిలిచాయి. ఏపీకి విభజన తర్వాత నిధుల కొరత వెంటాడుతుండం, కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందకపోవడం వంటి కారణాలతో విశ్వవిద్యాలయాల పనితీరు నాసిరకంగా తయారవుతోందన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయాల సంగతి సరేసరి.












Click it and Unblock the Notifications