వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న చంద్రబాబు!
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో త్వరలోనే చేరికలు ఉంటాయని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఇతర పార్టీలకు చెందినవారు టీడీపీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో పార్టీలోని అన్ని విభాగాల్లో, ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

ఏ మూలకు వెళ్లినా టీడీపీ చేసిన అభివృద్ధే
తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా టీడీపీ చేసిన అభివృద్ధి కనపడుతుందన్నారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని, ఎన్టీఆర్ అంటే తనకు గౌరవం లేనట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారని, ఆయనంటే గౌరవం ఉందన్నారు. ఎన్టీఆర్ తో విభేదాలను, పరిష్కారానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ ఒక టీవీ షోలో వివరించినట్లు చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల మేరకే టీడీపీ పనిచేస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. త్వరలోనే తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తానని పార్టీ నేతలకు తెలిపారు.

వారంలో ఐదురోజులు తెలంగాణ నేతలకు..
చంద్రబాబు ఇటీవలి కాలంలో తరుచుగా తెలంగాణకు చెందిన నేతలతో సమావేశమవుతున్నారు. వారంలో ఐదురోజులు తెలంగాణ నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడంవల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త మరో పదిమంది కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ క్రమేపీ తెలంగాణలో బలహీనపడుతూ వచ్చింది. ఎక్కువ సంఖ్యలో నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత..
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసినట్లవుతోందంటున్నారు. ఇప్పటివరకు రెండు ఎన్నికలు జరగ్గా ఆ రెండు ఎన్నికల్లోను కేసీఆర్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడమే కాకుండా ఆంధ్రుల పార్టీగా చూపించి ఓట్లు కొల్లగొట్టుకున్నారని, ఇకనుంచి అటువంటి అవకాశం ఉండదంటున్నారు. తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ ఎస్ కు రాజీనామా చేసిన బూర నర్సయ్యగౌడ్ చేరతారని, టీడీపీ తరఫున పోటీకి దిగుతారని వార్తలు వచ్చాయికానీ అది జరగలేదు. మునుగోడులో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి












Click it and Unblock the Notifications