Xలో సుదీర్ఘ పోస్టు పెట్టిన చంద్రబాబు
Chandrababu Naidu: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- పింఛన్ల పంపిణీ వ్యవహారం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతోంది. రాష్ట్రంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.
అసెంబ్లీ, లోక్‌సభ ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయడం సరికాదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు సానుకూలంగా స్పందించారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

దీనితో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి పింఛన్ మొత్తాన్ని ఇవ్వడానికి బదులుగా సచివాలయం వద్ద ఆ మొత్తాన్ని పంపిణీ చేసే ఏర్పాట్లు తీసుకుంది. ఈ మేరకు కొత్తగా గైడ్‌లైన్స్ జారీ చేసింది.
చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తుడు అనే పేరుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు. తెలుగుదేశ పార్టీనే ఆయనతో ఈసీకి ఫిర్యాదు చేయించిందనే ప్రచారం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతోంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పలు పిటీషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలకు దిగారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూరకంగానే పేదల పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసియడం దారుణం అని విమర్శించారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత జగన్ 15 రోజుల్లో 13,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు. అలాంటిది పేదలకు పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు. పింఛన్ మొత్తాన్ని తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే- 1వ తేదీ నాడే ఇంటి వద్దనే పింఛన్ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. వలంటీర్లను ఈసీ వద్దంటే 1.26 లక్షల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారని వారితో ఒక్క రోజులో ఇంటి దగ్గరకే పింఛన్ తెచ్చి ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. అలా ఎందుకు చేయలేదని నిలదీశారు.
వృద్దులు, వికలాంగులకు మానవీయ కోణంలో పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాలని సూచించారు. వాళ్లను మూడు కిలోమీటర్ల దూరంలోని సచివాలయానికి మండుటెండలో రమ్మంటారా? ఇదేం నీచ రాజకీయం అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు.
జగన్ రాజకీయ క్రీడలో వలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు చంద్రబాబు. వలంటీర్ల విషయంలో ఎన్డీఏ కూటమికి స్పష్టత ఉందని, తాము అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. వాళ్లకు ఇంతకన్నా మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా కల్పించారు.
జగన్ మాటలను వలంటీర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. వైసీపీ కోసం పని చేయొద్దని హితవు పలికారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 4,000 రూపాయల పెన్షన్‌ను ఇంటింటికీ ఇస్తామని, రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications