పిఠాపురం కోసం ఆ ఇద్దరినీ బరిలోకి దింపిన చంద్రబాబు
ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. వచ్చేనెల 13వ తేదీన జరిగే ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగోతేదీన వెలువడనున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. పవన్ ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దీంతో పవన్ కల్యాణ్ ను గెలిపించే బాధ్యతను చంద్రబాబు స్వీకరించారు.
పిఠాపురం తెలుగుదేశం పార్టీ నేతగా కొనసాగుతున్న వర్మ మొదట్లో కొంత అలిగినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని, ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో పవన్ ను గెలిపించేందుకు ఆయన అంగీకరించారు. దీనికి అనుగుణంగా తన అనుచరులతో మంతనాలు సాగిస్తూ మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరి మంత్రి అయిన సుజయకృష్ణ రంగారావు ప్రస్తుతం టీడీపీ తరఫున బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు.

సుజయ్ కృష్ణకు కూడా పవన్ గెలుపు బాధ్యతను చంద్రబాబు అప్పజెప్పారు. వీరేకాకుండా జిల్లాస్థాయిలో పదవుల్లో రాణించిన నాయకులకు కూడా వార్డులవారీగా బాధ్యతలు అప్పజెప్పారు. తాజాగా పిఠాపురం వచ్చిన పవన్ కల్యాణ్ శక్తిపీఠాలను సందర్శించడమే కాకుండా శ్రీపాద శ్రీవల్ల క్షేత్రాన్ని కూడా సందర్శించారు. ముందుగా వర్మ తల్లి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. వర్మ పనిచేస్తే పవన్ కల్యాణ్ కు ఊహించనిరీతిలో మెజారిటీ వస్తుందని కూటమి నాయకులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఇండిపెండెంట్ గా పోటీచేసి విజయం సాధించిన వర్మ ఆ సమయంలో ఎటువంటి వ్యూహాలను అమలు చేశారో తెలుసుకొని వాటిని తిరిగి పవన్ కల్యాణ్ గెలుపు కోసం అమలు చేయబోతున్నారు. కాకపోతే అప్పటికీ, ఇప్పటికీ మారిన పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications