కంచుకోటలన్నీ టీడీపీ ఖాతాలోనే? చంద్రబాబు ప్రణాళిక?
టీడీపీలో ఎంతోమంది సీనియర్ నేతలు కూడా గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన కొత్త అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో కంచుకోటలు అని చెప్పుకోదగ్గ నియోజకవర్గాలు దాదాపు 50 వరకు ఉంటాయి. కుప్పం, హిందూపురం తరహాలో. కానీ గత ఎన్నికల్లో జగన్ హవా ముందు కంచుకోటలను కూడా ఆ పార్టీ కాపాడుకోలేకపోయింది. ఈ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులంతా విజయానికి దగ్గరగా వచ్చి స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం వీటిని ఎట్టి పరిస్థితుల్లోను కైవసం చేసుకోవాలనేది పార్టీ అధినేత చంద్రబాబు ప్రణాళికగా ఉంది.

ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ టీం
టీడీపీలో ఎంతోమంది సీనియర్ నేతలు కూడా గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన కొత్త అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ టీం ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది. వారి వ్యూహంలో భాగంగా కంచుకోటలపై మొదట టీడీపీ దృష్టిసారించింది. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు, టీడీపీకి వచ్చిన ఓట్లు, జనసేనకు పడిన ఓట్లు, మెజారిటీ ఎంత? రేపటి ఎన్నికల్లో జనసేనతో పొత్తుంటే ఓటింగ్ ఎంత శాతం పెరుగుతుందనే విషయాలపై రాబిన్ శర్మ టీం నివేదిక ఇచ్చింది.

అదనంగా 40 గెలుచుకుంటే చాలు..
ఈ కంచుకోటల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది? వారిలో గెలుపు గుర్రాలెవరు? వాటిని దక్కించుకోవడానికి టీడీపీ చేయాల్సిన కసరత్తులేమిటి? అన్న విషయాలపై సర్వే చేయించి చంద్రబాబు నివేదిక తెప్పించుకున్నారు. కంచుకోటలను దక్కించుకోగలిగితే వాటిని అదనంగా కష్టపడాల్సిన నియోజకవర్గాలు 30 నుంచి 40 మధ్యలో ఉంటాయని, ఈ నేపథ్యంలో అధికారం దక్కించుకోవడం సులభమవుతుందని అంచనా వేస్తున్నారు.

వివరాలు సేకరిస్తోన్న టీడీపీ
ఈ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధుల గురించి ప్రజలేమనుకుంటున్నారు? అనేది ప్రధానాంశంగా టీడీపీ వివరాలు సేకరిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైనవాటినన్నింటినీ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ అందుకనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రజలు కోరుకున్న స్థాయిలో వీరు పనితీరు కనపరచడంలేదని తేలడంతో దీన్ని సదవకాశంగా మలచుకొని ఈ నియోజకవర్గాలన్నింటినీ దక్కించుకోవడానికి అడుగులు వేస్తోంది.
బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్యమైన రీతిలో స్పందన వెలువడటంతో పార్టీ అధినేత చంద్రబాబు అప్పటికప్పుడు తన వ్యూహాన్ని మార్చారు. నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జిలందరినీ ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలు రూపొందించమని ఆదేశాలు జారీచేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా కంచుకోటలను ఒకేసారి చుట్టిరావడానికి చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారు.












Click it and Unblock the Notifications