టీడీపీ అధికారంలోకి రావాలంటే- ఆ 25 నియోజకవర్గాలపైనే చంద్రబాబు ఫోకస్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి పండగ సెలవుల మూడ్ నుంచి బయటికొచ్చారు. ఇక పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. అదే సమయంలో- ఈ నెల 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్న యువగళం పాదయాత్ర ఏర్పాట్లనూ పర్యవేక్షించనున్నారు.

నారావారిపల్లిలో..
నిన్నటి వరకు చంద్రబాబు- సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. తన సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలను జరుపుకొన్నారు. కనుమ నాడు పీలేరుకు వెళ్లారు. సబ్ జైలులో ఉన్నపార్టీ కార్యకర్తలను పరామర్శించారు. పుంగనూరు నియోజకవర్గంలో ఈ నెల 7వ తేదీన రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో వారు అరెస్ట్ అయ్యారు.

నియోజకవర్గాల సమీక్షలు..
చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం ఇక చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశాలపై ఫోకస్ పెట్టారు. ఇవ్వాళ పునరుద్ధరించారు. ఇదివరకు తాత్కాలికంగా పుల్ స్టాప్ పెట్టిన సమీక్షా సమావేశాలు ఇవి. వాటిని మళ్లీ పట్టాలెక్కించారు. ఇప్పటివరకు 150 స్థానాల్లో సమీక్షలను పూర్తి చేశారాయన. 25 సీట్లను పెండింగ్ లో ఉంచారు. ఇప్పుడు వాటిని సమీక్షలోకి తీసుకున్నారు.

పార్టీ స్థితిగతులపై ఆరా..
తొలిదశలో ఇవ్వాళ ఆరు నియోజకవర్గాలపై సమీక్షించనున్నారు చంద్రబాబు. కోనసీమ జిల్లా రాజోలు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, కడప, నంద్యాల, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన పార్టీ నాయకులను కలుసుకోనున్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, కో ఆర్డినేటర్లు, మండలస్థాయి నాయకులను ఈ సమావేశానికి పిలిపించారు. 2019 నాటి ఎన్నికల్లో ఈ ఆరు చోట్ల కూడా టీడీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే.

గెలుపుకోసం..
2024 నాటి ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలన్నింట్లోనూ గెలిచి తీరాల్సి ఉంటుందని చంద్రబాబు పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. వైఎస్ఆర్సీపీ బలాబలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలు, అందుకు దారి తీసిన పరిస్థితులు.. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయం మీద ఆయన ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications