వారెవ్వా.. చంద్రబాబు కామెంట్స్ అదిరిపోయాయిగా..
ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన చెత్త సైకో ముఖ్యమంత్రి జగన్ అని చంద్రబాబు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్‌లు వేస్తాడట.. 'నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం' అని ప్రజలు అంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల కష్టాలకు కారకుడైనవారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్ వేస్తాడంట అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ను ఇంటికి పంపించేందుకు మహిళలంతా వీర నారీమణుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 'ఇదేం ఖర్మ' మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

45 రకాల పన్నులు వేశారు
ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన చెత్త సైకో ముఖ్యమంత్రి జగన్ అని, తన బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఏ తల్లైనా ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. జగన్ ఇచ్చే పది రూపాయలు మాత్రమే కనిపిస్తోంది కానీ, దానిచాటున దోచుకునే రూ.50 గురించి ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకోగలిగితే వైసీపీ నాయకుల్ని మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వరన్నారు. ఏమరుపాటుగా ఉంటే ప్రజల ముఖాలకు కూడా రంగులు వేస్తాడని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసిరస్తోన్న విధానాలతో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అడుగడుగునా ఘనస్వాగతం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ప్రతి సెంటర్ లో క్రేన్ ద్వారా భారీ గజమాలతో చంద్రబాబుకు సత్కారం చేశారు. మధురపూడి విమానాశ్రయం నుంచి బూరుగుపూడి, కోరుకొండ మీదగా గుమ్మళ్ల దొడ్డికి చేరుకున్న చంద్రబాబుకు మహిళలు హారతలు పట్టడంతోపాటు దిష్టి తీశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం..
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని, వారికి సంబంధించిన వెయ్యి ఎకరాల పరిహారాన్ని బోగస్ పట్టాలతో వైసీపీ నేతలు కొట్టేస్తున్నారని వెల్లడించారు. దీనిపై తెలుగుదేశం అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ జరిపిస్తుందని, ప్రజాధనాన్ని హారతి కర్పూరంలా మింగేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజల భూములు సర్వే చేసి .. జగన్ తన బొమ్మలు వేసుకుంటున్నాడని, ఆ పార్ట పనైపోయిందని, గెలిచే అవకాశమే లేదని చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారు.












Click it and Unblock the Notifications