విశాఖ కేంద్రంగా టీడీపీ కౌంటర్ స్ట్రాటజీ : పోటీ జేఏసీ - ప్రజాగర్జన..!!
విశాఖ కేంద్రంగా ఇప్పుడు కొత్త రాజకీయ వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే విశాఖ గర్జన ద్వారా మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ మద్దతుతో భారీ ర్యాలీ - సభ నిర్వహించారు. విశాఖ రాజధానికి టీడీపీ వ్యతిరేకం-ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ అడ్డుపుడుతోందని వైసీపీ నేతలు తెలుగుదేశం నేతలను ఫిక్స్ చేసే ప్రయత్నం చేసారు. ఇప్పుడు దీనికి కౌంటర్ గా టీడీపీ కొత్త వ్యూహం ఖరారు చేసింది. అందులో భాగంగా పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

విశాఖలో గర్జన సభ
అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర నాయకులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. విశాఖపట్నం రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉంటుందని తేల్చి చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించినప్పటి నుంచి అరసవిల్లి చేరేంత వరకు రక్షణగా ఉండడంతోపాటు అడుగడుగునా స్వాగతం పలకాలని తీర్మానించారు. త్వరలో జేఏసీ ఏర్పాటుచేసి విశాఖలో గర్జన సభ నిర్వహించాలని నిర్ణయించారు. వైసీపీ నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందాం అనే నినాదంతో జేఏసీని ఏర్పాటుచేసి విశాఖలో త్వరలో గర్జన సభ నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రకటించారు.

అమరావతే ఏకైక రాజధాని
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 150 పీట్లు వస్తాయని అనేక సర్వేలు చెబుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో సీఎం జగన్, ఆయన పేటీఎం బ్యాచ్ రంగంలోకి దిగిందని విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు తీసుకురావడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు వికేంద్రీకరణ పేరిట కొత్త నాటకం ఆడుతోందని కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజీనామా లేమిటో అర్థం కావడం లేదన్నారు. మనిషికి ఒకటే బుర్ర ఉంటుందని, మూడు బుర్రలుంటే ఆలోచనలు చేయలేమని పేర్కొంటూ మూడు రాజధానులంటే పాలన చేయలేమన్నారు. వైసీపీ పెద్దల అరాచకాలతో ఉత్తరాంధ్రలో వేల కోట్లు దోపిడీ జరిగిందని పార్టీ వసీనియర్ నేత కళా వెంకటరావు ఆరోపించారు.

రైతుల యాత్రకు రక్షణగా
విపక్షంలో ఉన్న వారు గర్జనలు, సభలు పెడుతుంటారని, విచిత్రంగా అధికారంలో ఉన్న పార్టీ గర్జన ర్యాలీ నిర్వహించి ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర ఎక్కువగా నష్టపోయిందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన నాయుడు ఆరోపించారు. వికేంద్రీకరణ కోసం రాజీనామాలు చేశామంటున్నారని, అయితే రాజీనామా ఏ ఫార్మెట్‌లో రాయాలో తన వద్దకు వస్తే చెబుతానన్నారు. కేవలం 29 గ్రామాల రైతులకే అమరావతి పరిమితమని చెబుతున్న నాయకులు, విశాఖలో రాజధాని పెడితే ఎన్ని గ్రామాలకు విస్తరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మశ్రీ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎందుకు రాజీనామా చేయలేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications