వైసీపీకి భారీ విజయం: టీడీపీ అవుట్: చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
Chandrababu Naidu: విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మినహా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏదీ లేదు. రెండు నెలల కిందటే ఈ ప్రక్రియ మొత్తం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటింది.
జూన్ 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు నెలల వ్యవధిలో చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొనబోతోన్న తొలి ఎన్నిక.. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీదే.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీలో నిలిచారు. టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఇంకా తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. నామినేషన్లను దాఖలు చేయడానికి నేడే తుదిగడువు. బొత్స సత్యనారాయణ సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు.
ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలా? వద్దా? అనే సస్పెన్స్‌కు తెలుగుదేశం పార్టీ తెర దించిది. పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు చంద్రబాబు విశాఖపట్నం జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన ఆ జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఈ విషయంలో జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి నేతల అభిప్రాయాన్ని సైతం తీసుకున్నారు చంద్రబాబు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరితోనూ భేటీ అయ్యారు. అభ్యర్థిని నిలబెట్టడంపై తుది నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలివేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో కూటమి నుంచి ఎవరూ నామినేషన్‌ను దాఖలు చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఫలితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇక లాంఛనప్రాయమేనని అవ్వొచ్చు. ఈ ఎన్నికల్లో మొత్తం 838 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓట్లు ఉండగా.. వైఎస్ఆర్సీపీకి 538 సభ్యలు బలం ఉంది.












Click it and Unblock the Notifications