'బాబు'ను నమ్ముకున్నందుకే ఈ గతి: మోసం చేశారంటూ కడపలో టీడీపీ ధర్నా!
15ఏళ్లుగా టీడీపీ కోసం కష్టపడుతుంటే తనకు ఏవిధమైన గుర్తింపు దక్కలేదని, ఆఖరికి ఆర్థికంగాను దెబ్బతిన్నానని పార్టీ నేత ఒకరు కన్నీళ్లు పెట్టుకున్నారు.
కడప: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సొంత గూటి నేతల నుంచే సెగ తగులుతోంది. అంబేడ్కర్ 126వ జయంతి వేడుకల నేపథ్యంలో.. పార్టీలోని దళిత నేతలంతా అధిష్టానంపై తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు ఊహించని షాక్ ఇవ్వగా.. కడప జిల్లాలోను దళిత కార్యకర్తలు నిరసన బాట పట్టడం చంద్రబాబుకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.
జిల్లాలోని టీడీపీ నేతలంతా చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా ఆమరణ నిరహార దీక్షకు దిగారు. వీరిలో మహిళా కార్యకర్తలు కూడా ఉండటం గమనార్హం. టీడీపీ నాయకత్వం ఇప్పటికీ తమను అంటరానివారిగా చూస్తోందంటూ కడపలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ నేతలు ఆమరణ నిరహార దీక్షకు దిగారు.
దశాబ్దాలుగా టీడీపీ జెండా మోస్తూ పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నా చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పట్ల విధేయతతో వ్యవహరిస్తూ పార్టీ కోసం ఎంతో చేసినందుకు తాము నష్టపోయామని దీక్ష చేస్తున్న నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకత్వం తమను మోసం చేసిందని ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవతున్నా.. పార్టీలో దళిత నేతలను పట్టించుకోవడం లేదన్నారు. ఏళ్లుగా పార్టీలో ఉన్నవారిని కాదని కొత్తగా పార్టీలోకి ఫిరాయించినవారికి పదవులు ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 15ఏళ్లుగా టీడీపీ కోసం కష్టపడుతుంటే తనకు ఏవిధమైన గుర్తింపు దక్కలేదని, ఆఖరికి ఆర్థికంగాను దెబ్బతిన్నానని పార్టీ నేత ఒకరు కన్నీళ్లు పెట్టుకున్నారు.
తనలాగే పార్టీని నమ్ముకుని నష్టపోయినవారు చాలామంది ఉన్నారని ఆయన అన్నారు. ఏం చేయాలో తోచని స్థితిలో.. ఏం చేస్తే టీడీపీ అధిష్టానం స్పందిస్తుందో తెలియని స్థితిలోనే తామంతా ఆమరణ నిరాహారణ దీక్షకు దిగాల్సి వచ్చిందని పార్టీ నేతలు చెప్పారు.
కాగా, ఈమధ్యే కడపలో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి.. జగన్ కంచుకోటలో పాదం మోపిన టీడీపీకి ఇదో ఊహించని పరిణామం. ఓవైపు పార్టీని బలోపేతం చేయడానికి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. ఉన్నవాళ్లకే న్యాయం చేయడం లేదంటూ సొంతగూటి నేతలే రోడ్డెక్కడం ఆ పార్టీ పరువు తీసేదిగా మారింది. మొత్తం మీద దళిత నేతలంతా ఒకేసారి తమ నిరసన స్వరం వినిపించడం చంద్రబాబు నాయుడుకు కచ్చితంగా ప్రతికూల పరిణామమే.












Click it and Unblock the Notifications