టీడీపీకి రిటర్న్ గిప్ట్ ఇచ్చేందుకు కీలక నేత రెడీ..!
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన ప్రకంపనలు టీడీపీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు.
తాజాగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత సైతం టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరుఫున పోటీ చేసిన మీసాల గీత ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఆ తరువాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆమె టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసిన మీసాల గీత రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అయితే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజుతో ఆమెకు తీవ్ర విభేదాలు తలెత్తాయి. పార్టీ కార్యాలయం విషయంలో వర్గపోరు ఎక్కువైంది. ఈక్రమంలోనే 2019 ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కకుండా అశోక్ గజపతిరాజు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మీసాల గీత స్థానాన్ని అశోక్ గజపతిరాజు కూతురు అదితికి కేటాయించారు. దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గీత టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నుండి కనీస స్పందన కూడా లభించలేదు. దీంతో బాగా నొచ్చుకున్నారామె.
అయినప్పటికీ కూడా ఆమె టీడీపీలోనే కొనసాగారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే అని చంద్రబాబు, నారా లోకేష్ హామీ ఇవ్వడంతో ఆమె నియోజకవర్గంలో విసృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో మీసాల గీత అసంతృప్తి గురయ్యారు. ఈక్రమంలో ఆమె టీడీపీ రాజీనామా చేయడానికి సిద్ధమైయ్యారు. ఈ సందర్భంగా మీసాల గీత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ కారణం లేకుండానే తనకు 2019 టికెట్ ఇవ్వలేదని.. అయిన తాను పార్టీలోనే కొనసాగనని ఆమె చెప్పుకొచ్చారు.
ఇప్పుడు టికెట్ తనకే అని మోసం చేసి మరొకరికి ఇచ్చారని.. దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానని మీసాల గీత తెలిపారు. ఇన్ని అవమానాల మధ్య తాను టీడీపీలో కొనసాగలేనని.. కార్యకర్తలు, అనుచరులు, ప్రజలు కోరిక మేరకు తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె ప్రకటించారు. మీసాల గీత స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ ప్రభావం టీడీపీ మీద పడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.మరీ మీసాల గీత ఇండిపెండెంట్ పోటీ చేసి ఏ పార్టీ ఓట్లను చీల్చుతారో చూడాలి.












Click it and Unblock the Notifications