వందరోజుల కోసం చిరు: సిఎం, కేంద్రం పోవాలి: లగడపాటి
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల పదవి కోసం చిరంజీవి ఆరాటపడుతున్నారని విమర్శించారు. మంగళవారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు టిడిపి సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సిఎం రమేష్ తదితరులు మాట్లాడారు. యూపిఏ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. అధిక ధరలు, అవినీతి నేపథ్యంలో యూపిఏ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఈ ప్రభుత్వం ఇక వంద రోజులు కూడా కొనసాగే హక్కు కోల్పోయిందన్నారు. నాలుగు రాష్ట్రాలలో ఘోర పరాజయం దానిని తెలియజేస్తోందన్నారు. తమ అవిశ్వాస తీర్మానం వేరన్నారు.

ఈ ప్రభుత్వం పోవాలి: లగడపాటి
ప్రజల విశ్వాసం కోల్పోయిన ఈ ప్రభుత్వం పోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. యూపిఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు. తాము అవిశ్వాసానికి మద్దతుగా జాతీయ పార్టీలు, నాయకుల మద్దతును కూడగడతామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేదన్నారు.
సభలో సమైక్యాంధ్ర నినాదాలు
మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి ఉభయ సభలో ప్రారంభమయ్యాయి. లోకసభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్య నినాదాలు చేశారు. యూపిఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని నినాదాలు చేశారు. ఎంపీలు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications