పాచిక పారేనా?: జగన్ ఇలాకాలో కీలక పదవిపై కన్నేసిన టిడిపి
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే కడప కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కార్పొరేషన్లో పనుల మంజూరు, రద్దు, బదిలీలతో పాటు పలు పాలనా వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో స్టాండింగ్ కమిటీ పదవిని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్ర కసరత్తులే చేస్తోంది. అదే స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సాగుతోంది.
కాగా, నవంబర్ 23న జరిగే ఈ కమిటీ ఎన్నిక కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఇరుపార్టీల వారు ఆ కమిటీని దక్కించుకునేందుకు సంఖ్యాబలాలను సరిచూసుకుంటున్నారు. నోటిఫికేషన వచ్చిన రోజు నుంచే నామినేషన్లు ప్రారంభం కావడంతో కార్పొరేషనలో స్టాండింగ్ కమిటీ వేడి మరింత పెరిగింది.

ఈ ఎన్నికలు ఇరుపార్టీలకు ప్రతిష్టాత్మకం ఎందుకంటే.. రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు చేపట్టబోయే పనులను స్టాండింగ్ కమిటీ అనుమతితో చేపట్టాల్సి వుంది. అలాగే సూపరింటెండెంట్ స్థాయి కిందిస్థాయి ఉద్యోగులను కమిటీ ఆమోదంతో బదిలీ చేయవచ్చు. అలాగే మున్సిపల్ ఆస్తులను లీజుకు ఇవ్వాలన్నా, రద్దు చేయాలన్నా స్టాండింగ్ కమిటీదే కీలకపాత్ర. కమిటీ సభ్యులకు ఏడాదిపాటు కాల పరిమితి వుంటుంది. తొలిసారి జరిగిన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి.
అప్పట్లో కార్పొరేషన్ లో వైయసస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 42, కాగా, తెలుగుదేశం బలం 8. అయితే నిరుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఆదినారాయణను అభ్యర్థిగా బరిలో నిలిపితే ఏకంగా అతనికి 18 ఓట్లు వచ్చాయి. ఇది అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. వైయస్సార్ కాంగ్రస్ పార్టీ కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు.
అయితే ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్‌లో గెలిచిన 12 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టిడిపి బలం 20కి చేరుకుంది. స్టాండింగ్ కమిటీని కైవసం చేసుకోవాలంటే 26 మంది కార్పొరేటర్ల బలం అవసరం. ఇప్పుడున్న పరిస్థితిలో అయితే వైసీపీ బలంగా వుంది.
అయితే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తూ మరికొంతమంది కార్పొరేటర్లపై ఆపరేషన ఆకర్ష్‌ను ప్రయోగించబోతోదంటూ ప్రచారం సాగుతోంది. ఎలాగైనా స్టాండింగ్ కమిటీని దక్కించుకోవాలనే ప్రయత్నంలో రెండు పార్టీలో తమ శాయశక్తులను ఒడ్డుతున్నాయి. మరి విజయం ఏ పార్టీని వరిస్తుందో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications