టీడీపీ చచ్చిపోయింది - ఆ పార్టీ జోలికి వెళ్తే..!!
అమరావతి: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ పొత్తు ప్రచారం జోరుగా సాగుతోంది. దసరా పండగ తరువాత తెలుగుదేశం పార్టీ- కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరబోతోందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పొత్తు పెట్టుకునే 2024 నాటి సార్వత్రిక ఎన్నికలకు ఈ రెండు పార్టీలు వెళ్తాయని, అధికారాన్ని అందుకుంటాయనే అంచనాలు విస్తృతంగా వెలువడుతున్నాయి.

చంద్రబాబు-మోడీ భేటీతో..
ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవడం, ఒకరినొకరు పలకరించుకోవడాన్ని దీనికి ఆధారంగా చూపుతున్నారు. పొత్తు వార్తలు, ప్రచారాలను స్వయంగా బీజేపీ నాయకులే తోసిపుచ్చుతున్నప్పటికీ- అవి మాత్రం సద్దుమణగట్లేదు. ఎవరి అంచనాలను వారు వ్యక్తం చేస్తోన్నారు. పొత్తు తప్పదనే సంకేతాలను పంపిస్తోన్నారు.

తోసిపుచ్చిన బీజేపీ నేతలు..
ఈ పొత్తు అంశం పైన బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్వయంగా తోసిపుచ్చారు. దుర్యోధనుడికి కృష్ణుడు కూడా సమయం ఇచ్చారని..వారిద్దరూ చేతులు కలపలేదంటూ విశ్లేషించారు. చంద్రబాబు-మోడీ కలుసుకున్నంత మాత్రాన టీడీపీతో పొత్తు ఉంటుందనుకోవడం భ్రమేనని సునీల్ దేవ్‌ధర్ స్పష్టం చేశారు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తోన్న ప్రచారం, మైండ్‌గేమ్‌గా అభివర్ణించారాయన.

లాబీదారులకు రెస్ట్..
ఈ పరిణామాల మధ్య బీజేపీ సీనియర్ నాయకుడు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పందించారు. టీడీపీ-బీజేపీ పొత్తు వ్యవహారంపై లాబీ పెద్ద ఎత్తున సాగుతోన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అది జరిగే పని కాదని పరోక్షంగా ప్రస్తావించారు. పొత్తు అజెండాతో లాబీ నిర్వహించే వారు ఇక విశ్రాంతి తీసుకోవచ్చని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. సునీల్ దేవ్‌ధర్ కామెంట్స్‌ను ఆయన దీనికి జత చేశారు.

అది చచ్చిపోయిన పార్టీ..
తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందని స్పష్టం చేశారు ఐవైఆర్ కృష్ణారావు. తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే బీజేపీకి సహాయ పడినట్టుగా కాకుండా అదనపు బరువుగా మారుతుందని వివరించారు. ఇలాంటి అదనపు బరువులను బీజేపీ మోయదలచుకోదని అన్నారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా తన యుద్ధాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో పోరాడటానికి- మనుగడ కూడా లేని పార్టీల సహకారం ఏ మాత్రం అవసరం లేదని ఆయన టీడీపీని ఉద్దేశించి చెప్పారు.












Click it and Unblock the Notifications