సీట్లపై చంద్రబాబు, పవన్ ఒప్పందం- ఎవరెక్కడ: బీజేపీతో పొత్తు, కీలక నిర్ణయాలు..!!
టీడీపీ, జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల సర్దుబాటు పైన రెండు పార్టీలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇద్దరు నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ కు అంతిమంగా 25 అసెంబ్లీ సీట్లు..రెండు లోక్ సభ సీట్లు ఖాయం కానున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు సిద్దమయ్యారు. ఇద్దరూ కలిసి భారీ సభ నిర్వహణకు నిర్ణయించారు. బీజేపీతో పొత్తు పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీట్ల పై క్లారిటీ: టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు పై దాదాపు క్లారిటీ వచ్చింది. చంద్రబాబు, పవన్ ఒకే రోజు రెండు విడతలుగా సమావేశమయ్యారు. సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార కార్యాచరణపై చర్చలు సాగాయి. జనసేనాని 32 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 20 స్థానాలిచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని.. వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని జనసేన వర్గాలు తెలిపాయి.

Recommended Video

టీడీపీ మరో ఐదు స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని, 27 ఇవ్వాలని పవన్ కోరుతున్నారని అంటున్నాయి. అలాగే కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. తాజాగా అనకాపల్లి గానీ, తిరుపతి గానీ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. సామాజిక సమీకరణలు, వైసీపీ అభ్యర్థులు, సర్వేల్లో వస్తున్న ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
పవన్ లిస్టులో: పవన్ కల్యాణ్ తమ పార్టీకి విజయనగరంలో 1, విశాఖ-6, తూర్పుగోదావరి-6, పశ్చిమ గోదావరి-4, కృష్ణా-3, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున కోరారు. కడప, కర్నూలు జిల్లాలో పవన్ ఒక్కో సీటు ప్రతిపాదించారు. వీటిలో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ (పశ్చిమ), తెనాలి, దర్శి సహా 20 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం.
కాకినాడ రూరల్ సీటు జనసేనకు ఇచ్చి.. కాకినాడ అర్బన్ సీటులో తాను పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. రాయలసీమ జిల్లాల్లో జనసేన ఆశిస్తున్న వాటిలో తిరుపతి, మదనపల్లె, రాజంపేట, అనంతపురం వంటివి ఉన్నాయి. జనసేనకు గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి సీటు ఆ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. సీట్లు..అభ్యర్దుల పైన ఈ నెల 8న మరోసారి సమావేశమై అభ్యర్దులను ఖరారు చేయనున్నారు.

బీజేపీతో తేల్చేద్దాం: ఈ భేటీ తర్వాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై స్పష్టత వస్తుందని ఆ పార్టీల వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో చంద్రబాబు, పవన్ ఇద్దరూ పాల్గొంటారు.
ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక, బీజేపీ పొత్తు పైన స్పష్టత తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల తరువాత పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ నేతల వైఖరి పైన క్లారిటీ తీసుకొని కలిసి వస్తే సీట్ల కేటాయింపు..మేనిఫెస్టో పైన చర్చ చేయనున్నారు. లేకుంటే..తమ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications