నందిగామ TDP అభ్యర్థి ఖరారు?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఒకటి నందిగామ. ఈ రిజర్వుడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తన ప్రత్యర్థి తంగిరాల సౌమ్యపై గెలుపొందారు. తాజాగా నందిగామ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖరారయ్యారంటూ సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది.

విజయం ఖాయమనే ధీమాలో..
తెలుగుదేశం పార్టీ తరఫున వివిధ మీడియా ఛానల్స్ డిబేట్స్ లో పాల్గొంటున్న డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావుకు కేటాయిస్తారనేది ఈ వార్త సారాంశం. పార్టీ తరఫున సమర్థంగా గళం వినిపిస్తున్న కొలికపూడికి చంద్రబాబునాయుడు కూడా పచ్చజెండా ఊపారంటున్నారు. రాజధాని పరిధిలోని తాడికొండ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా నందిగామ నుంచి పోటీచేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి నందిగామలో గట్టి పట్టుండటంతో విజయం ఖాయమనే ధీమాలో ఉన్నారు.

అమరావతి రైతుల గొంతుకగా కొలికపూడి
అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కొలికపూడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేశారు. నగరంలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. రైతుల తరఫున వివిధ టీవీ డిబేట్లలో పాల్గొనే కొలికపూడి అమరావతి ఉద్యమ రైతుల గొంతుకగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం ఒక టీవీ ఛానల్ లో చర్చ నడుస్తున్న సమయంలో భారతీయ జనతాపార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టి పాపులర్ అయ్యారు. ఈ సంఘటన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆయన మరింత చేరువయ్యారు.

కొలికపూడి సరైన ప్రత్యర్థి అవుతారు
సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావుకు కొలికపూడి అయితే సరైన ప్రత్యర్థి అవుతారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తంగిరాల సౌమ్యను పక్కనపెట్టే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. లేదంటే మరో రిజర్వుడు నియోజకవర్గంలో సౌమ్యకు సీటు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. దూకుడుగా ఉంటూ దూసుకుపోయే మనస్తత్వమున్న కొలికపూడి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న తప్పిదాలపై నేరుగా మాట్లాడతారు. అమరావతి ఉద్యమాన్ని సమర్ధించేవారంతా కొలికపూడిని సమర్థిస్తారు. ప్రతి అంశాన్ని విపులంగా విశ్లేషించి చెప్పడం ఆయన బలం. నందిగామ నియోజకవర్గానికి వినిపిస్తున్న ఆయన పేరుపై పార్టీ అధినేత చంద్రబాబే పూర్తి స్పష్టతనివ్వగలరు.












Click it and Unblock the Notifications