జగన్ సర్కార్ పై అశోక్ ఆసక్తికర వ్యాఖ్యలు-కోర్టు ఆదేశాలే లేకపోతే...
ఏపీలో గణేశ్ చతుర్ధి సందర్భంగా విధించిన కరోనా ఆంక్షలపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇవాళ తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా చవితి సంబరాలు చేసుకోకుండా ఆంక్షలు విధించడమేంటని అశోక్ ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న తమ నేతలకు ఒకలా, విపక్ష నేతలకు మరోలా చూస్తోందన్నారు.
రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా కరోనా ఆంక్షలు అనేవి అన్నింటికీ ఒకే విధంగా ఉండాలని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు తెలిపారు. ఏ పండక్కి లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. జగన్ సర్కార్ అన్ని మతాలను రాజ్యాంగం ప్రకారం గౌరవించాలన్నారు. అందరినీ సమానంగా చూడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు.కోర్టు ఆదేశాలు లేకపోతే..ఈపాటికి ఎంతమందిని జైల్లో పెట్టేవారో అని అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు.

దొంగల్ని ఎక్కడ ఉంచాలో.. అక్కడ ఉంచకుండా చూడటం వలనే ఈ దుస్థితి అని జగన్ సర్కార్ ను ఉద్దేశించి అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ నాశనం చేయకుండా చూడాలని వినాయకుడ్ని కోరుకుంటున్నానని పూజల అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్ ను నాశనం చేస్తే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.ఈ ప్రభుత్వంలో పారదర్శకత అనేది లేకుండా పోయిందని అశోక్ మండిపడ్డారు. ప్రభుత్వ జీవోలను ప్రజలకు అందుబాటులో పెట్టడం లేదని అశోక్ ఆక్షేపించారు. అధికారంలో ఉన్న నాయకుడు చుట్టూ జనం చేరితే కరోనా ప్రబలదా మరి ప్రతిపక్ష నేతలపై ఎందుకు కేసులు పెడుతున్నారని అశోక్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
మాన్సాస్ ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజును తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన వైసీపీ సర్కార్ విఫలమైంది. దీంతో అశోక్ పై నిత్యం వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన కూడా ఎప్పటికప్పుడు వాటికి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని తప్పుబడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మాన్సాస్ విషయంలో ఆడిట్ సహా తాము అనుకున్న ఏ పనీ చేయలేకపోయినా వైసీపీ సర్కార్.. తాజాగా మౌనంగా ఉండిపోతోంది.












Click it and Unblock the Notifications