కొడాలి నాని, వంశీపై బుద్దా సెటైర్లు..! మధ్యలో బూస్ట్ లు, కోడిగుడ్లు..!
ఏపీలో రాజధాని అమరావతి ప్రాంతంలో గత వైసీపీ హయాంలో ప్రత్యర్దులపై బూతులతో విరుచుకుపడ్డ ఆ పార్టీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా వారిద్దరి ఫిట్ నెస్, తిండి వంటి అంశాల్ని కూడా ఇందులోకి లాగేశారు. జగన్ ను తిరిగి సీఎం చేస్తామంటూ వీరిద్దరూ తిరగడంపై బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. ప్రజలు వైసీపీని నమ్మే పరిస్ధితి లేదన్నారు.
ఆరు నెలల తర్వాత వైసీపీని బలోపేతం చేసి వై.ఎస్ జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు పనిచేస్తామంటూ ప్రగల్బాలాలు పలికిన ఆ పార్టీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై బుద్దా వెంకన్న తనదైన శైలిలో చురకలు అంటించారు. ఒకరికి గుండె సరిగా పనిచేయదు, ఇంకొకరికి ఊపిరితిత్తులు,వెన్నుపూస దెబ్బతిన్నాయన్నారు. అలాగే బూస్ట్‌లు, కోడిగుడ్లు తిని ఆరు నెలల్లో జగన్‌ను సీఎం చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు.

కొడాలి నాని, వంశీ ఇంత బలహీనంగా ఉంటే... వారి నాయకుడు ఎంత బలహీనంగా ఉన్నాడో అర్థమవుతోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావటం కల అంటూ స్ఫష్టం చేశారు. ఇప్పుడు ఉన్నది ప్రజా క్షేమం కోరే ఎన్డీయే కూటమి ప్రభుత్వమని, ప్రజలు వైసీపీ నాయకుల్ని విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లు, దుర్మార్గులకు అండగా వుంటూ వారిని కాపాడుతున్న జగన్ ను, వైసీపీని అడ్రస్ లేకుండా చేయాలని ప్రజలకు బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట రామిరెడ్డి ఇద్దరు నరరూప రాక్షసులైతే, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మరోరకం రాక్షసుడన్నారు. పిన్నెల్లి సోదరులకు దయ,కరుణ అన్నదే వుండదన్నారు. వీరికి బడుగు బలహీన వర్గాల ప్రజలంటే చులకన అన్నారు. అందుకే వారి అరెస్ట్ ను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని బుద్దా తెలిపారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటున్నారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications