వాషింగ్టన్ సుందర్ కు రీప్లేస్మెంట్: 33 ఏళ్ల వయస్సులో సెలెక్టర్ల కంట్లో పడ్డాడు- బ్యాటింగ్ లోనూ తోపే
మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు ఎట్టకేలకు బీసీసీఐ సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో మొదటిసారి చోటు లభించింది. గాయం వల్ల జట్టుకు అందుబాటులో లేని వాషింగ్టన్ సుందర్ స్థానంలో సారాంశ్ ఎంపికయ్యాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయబోతోన్నాడు.
ప్రస్తుత కాలంలో చాలామంది ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టుకు ఎంపికవుతున్న విషయం తెలిసిందే. బుమ్రా మొదలుకుని తిలక్ వర్మ దాకా చాలామంది క్రికెటర్లు ఐపీఎల్ ద్వారానే టీమిండియాకు సెలెక్ట్ అయ్యారు. సారాంశ్ మాత్రం దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. రంజీ, దులీప్, ఇరానీ.. వంటి దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో నిలకడగా రాణించడం ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో అతడు చూపిన ప్రతిభే ఇప్పుడతనికి భారత్ తరఫున ఆడే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.

2014లో ఓ క్లబ్ తరఫున ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో, అతని తండ్రికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొడుకు ఆటపై దృష్టి కోల్పోకూడదనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన తర్వాతే తండ్రి అనారోగ్యం గురించి సారాంశ్ జైన్‌కు తెలిసింది. ఆ కష్టకాలంలో తండ్రి ఇచ్చిన ఒక చిన్న లేఖ అతనికి కొండంత బలాన్ని ఇచ్చింది. ఆ లేఖలో తండ్రి రాసిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని సారాంశ్ దేశవాళీ క్రికెట్‌లో అప్రతిహతంగా దూసుకుపోయాడు.
ఎడమచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే ఈ 33 ఏళ్ల ఆటగాడి ఫస్ట్ క్లాస్ కెరీర్ అద్భుతంగా సాగింది. ఇప్పటివరకు ఆడిన 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 27.30 సగటుతో 188 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో రెండు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2,223 పరుగులు చేశాడు. ఇటీవల ఇండియా-ఎ తరఫున శ్రీలంకలో జరిగిన అనధికారిక టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
శ్రీలంక పర్యటనలో టీమిండియా మొత్తం రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ను ఆడనుంది. మొదటి టెస్ట్ ఆగస్టు 15న ప్రారంభమౌతుంది. గాలే దీనికి వేదిక. రెండో టెస్టు అదే నెల 23 నుంచి 27 వరకు కొలంబో జరుగుతుంది. ఈ సిరీస్ ఆడే జట్టులో.. శుభమన్ గిల్ (కేప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కేప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications