పవన్ తో కేశినేని చిన్ని భేటీ - టీడీపీలో ఏం జరుగుతోంది..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో టీడీపీ -జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో విజయవాడ టీడీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తు కారణంగా ఎవరికి సీటు వస్తుందనేది ఉత్కంఠ పెంచుతోంది. ఈ సమయంలోనే కేశినేని చిన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. కీలక హామీ దక్కినట్లు చెబుతున్నారు.
కొత్త రాజకీయం : విజయవాడ టీడీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ -జనసేన పొత్తుతో సీట్ల కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. విజయవాడ పశ్చిమం సీటు కోసం టీడీపీలో పోటీ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. ఇదే సీటు పైన జనసేన నుంచి పోతిన మహేశ్ సీటు ఆశిస్తున్నారు. సెంట్రల్ నుంచి బోండా ఉమా తిరిగి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తిరిగి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక..ఎంపీగా కేశినేని నాని పోటీ పై సస్పెన్స్ కొనసాగుతోంది. విజయవాడ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్దిగా చిన్ని పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది.

మారుతున్న లెక్కలు : ఈ సమయంలోనే చిన్ని ఇప్పుడు జనసేనాని పవన్ తో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారింది. ఇది మర్యాద పూర్వక భేటీగానే చెబుతున్నారు. ఈ భేటీలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపైన చర్చించినట్లు తెలుస్తోంది. విజయవాడ లోక్ సభ పరిధిలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను చిన్ని వివరించారు. రెండు పార్టీలను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తన కార్యాక్రమాల గురించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో పవన్ జనసేన-టీడీపీ కార్యకర్తల మధ్య సమన్వయం గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తలు కలిసి ఎన్నికల్లో పని చేయాలని... వైసీపీ ఓడించేందుకు కష్టపడాలని సూచించినట్లు సమాచారం.
విజయవాడపై ఫోకస్ : విజయవాడలో భారీ బహిరంగ సభ కు చంద్రబాబు - పవన్ హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో మద్దతుగా నిలిచినందకు పవన్ కు చిన్ని ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు పరిధిలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు చేసిన సేవలను వివరించిన చిన్ని..ఏ కొండూరు మండలంలోని తండాలను పర్యటించి బాధితులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. ఈ భేటీ సమయం లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రతీ నియోజకవర్గం నుంచి కూలంకషంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ విజయవాడ పర్యటనకు వస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications