TDP నేతను 200 కిలోమీటర్లు తిప్పి తిప్పి కొట్టారు
తనను వాహనంలోకి ఎక్కించి ఏ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అర్ధరాత్రి 2.00 గంటల వరకు 200 కిలో మీటర్లు తిప్పారని పట్టాభి చెప్పారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ పోలీసులపై తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పట్టాభి మీడియాతో మాట్లాడారు. తనపై పోలీసు స్టేషన్‌లో దాడి జరిగిందని, బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి మద్దతు తెలిపేందుకు తాను గన్నవరం వెళ్లానని, అయితే పోలీసులు అక్రమంగా కేసుల్లో ఇరికించారని వెల్లడించారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి తనను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు.

200 కిలోమీటర్లు తిప్పారు
తనను వాహనంలోకి ఎక్కించి ఏ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అర్ధరాత్రి 2.00 గంటల వరకు 200 కిలో మీటర్లు తిప్పారని పట్టాభి చెప్పారు. తనతో పాటు ఉన్న ఇద్దరు ఎస్ఐలకు ప్రతి 15 నిమిషాలకు ఓ సారి జిల్లా ఎస్పీ ఫోన్ చేస్తారని, తనను అరెస్ట్ చేసినప్పటి నుంచి వ్యవహారమంతా జిల్లా ఎస్పీ డైరెక్షన్‌లోనే నడిచిందని, అర్ధ రాత్రి 2.00 గంటల సమయంలో తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు.

స్టేషన్ లో కరెంటు లేదు
ఊరంతా విద్యుత్తు ఉంటే స్టేషన్ లో మాత్రం విద్యుత్తు లేదని, పూర్తిగా చీకటిగా ఉందన్నారు. తనతోపాటు ఉన్న పోలీసులను స్టేషన్ లో ఎందుకు కరెంటు లేదని ప్రశ్నించానని, పవర్ ఫెయిల్యూర్ అని చెప్పారని, కరెంటు వస్తుందిలే అంటూ లోపలికి తీసుకువెళ్లారన్నారు.
లోపల ఒక్క కానిస్టేబుల్ కూడా లేరని, స్టేషన్ అంతా నిర్మానుష్యంగా ఉందని, తనను ఒక్కడినే అక్కడ కూర్చోబెట్టి మళ్లీ వస్తామని చెప్పి పోలీసులు బయటకు వెళ్లారన్నారు.

లోపలికి ఈడ్చుకెళ్లారు
అలా పోలీసులు వెళ్లిన పావుగంటకు ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకొని వచ్చారన్నారు. తన ముఖానికి టవల్ చుట్టి ఊపిరాడకుండా చేశారని, తర్వాత తనను ఓ గదిలోకి ఈడ్చుకెళ్లి విచక్షణా రహితంగా 35 నిముషాలపాటు తనను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. తన ముఖానికి ఉన్న టవల్ ను తీసిచూసే సరికి పోలీస్ స్టేషన్ లో ఎవరూ లేరని, తనను అక్కడే వదిలేసి వెళ్లారన్నారు.
తాను ఒక కుర్చీలో కూర్చున్న తర్వాత తనను స్టేషన్ లో దింపి వెళ్లిన ఎస్ ఐలు వచ్చారని, జిల్లా ఎస్పీ పక్కాగా ప్రణాళికను అమలుపరిచారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై నాలుగుసార్లు దాడి జరిగిందని, ఇది ఐదోసారని, ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగిస్తానన్నారు.












Click it and Unblock the Notifications