అమిత్ షా తో లోకేశ్ భేటీలో ఏం జరిగింది - నెక్స్ట్ ఇదేనా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో నారా లోకేశ్ సమావేశం అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనేది కొందరు టీడీపీ నేతల ఆరోపణ. ఈ సమయంలో లోకేశ్ హో మంత్రి అమిత్ షాను కలిసారు. ఈ భేటీ ఉద్దేశం పురందేశ్వరి స్పష్టం చేసారు. దీంతో, ఇక ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది.
అమిత్ షా తో భేటీ వెనుక
ఏపీలో రాజకీయం మారుతోంది. వరుసగా రెండు రోజులు సీఐడీ విచారణ ఎదుర్కొన్న లోకేశ్ ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు కేసుల అంశాన్ని వివరించారు. ఉద్దేశ పూర్వకంగా కేసులతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేసారు. చంద్రబాబు వయసును ప్రస్తావించిన అమిత్ షా ఆయన ఆరోగ్యం పైన వాకబు చేసారు.
అయితే, ఈ భేటీ వెనుక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చొరవ తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత 23రోజుల పాటు లోకేశ్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే అమిత్ షా తో కలవాలని ప్రయత్నాలు చేసారని చెబుతున్నారు. కానీ, కలవలేకపోయారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారం సాగుతున్న వేళ పురందేశ్వరి..ఇదే అంశం పైన బీజేపీ నాయకత్వంతో చర్చించినట్లు సమాచారం.

పురందేశ్వరి జోక్యంతో
లోకేశ్ నేరుగా అమిత్ షాతో కలిసేలా పురందేశ్వరి అప్పాయింట్ మెంట్ ఇప్పించారని తెలుస్తోంది. ఈ భేటీ తరువాత పురందేశ్వరి ట్వీట్ చేసారు. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ పాత్ర ఉంటే లోకేశ్ తో ఎలా సమావేశం అవుతారని ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీకి తెలంగాణ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తెలంగాణలో ఏపీ నుంచి సెటిలర్ల ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు ప్రభావితం చేస్తాయి.
చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదనే సంకేతాలు ఇచ్చేందుకు ఈ భేటీ జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉంటుందనే చర్చ తెర మీదకు వచ్చింది. కానీ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తుకు సిద్దంగా లేరనేది తాజా సమాచారం.
పొత్తుల దిశగా
ఇక..ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పైన కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. బీజేపీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కానీ, బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన లేదు. ఇక..తెలంగాణలో పవన్ 32 స్థానాల్లో పోటీకి సిద్దమయ్యారు. అక్కడ బీజేపీ, టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఇక.. ఏపీలో ఈ మూడు పార్టీల పొత్తు పైన తెలంగాణ ఎన్నికల తరువాతనే తేలే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో ఏపీలో రాజకీయ బలాబలాలు.. ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. అయితే, చంద్రబాబు బయటకు వచ్చిన తరువాతనే పొత్తులపైన అధికారికంగా నిర్ణయానికి అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications