ఉరవకొండలో ఉత్కంఠభరితం
Uravakonda Assembly round up: అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం.. మరోసారి హైఓల్టేజ్ ఫైట్‌కు కేంద్రబిందువు కానుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం హోరాహోరిగా పోరాడే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి కావడం దీనికి కారణం.
అనంతపురం లోక్‌సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు ఇది. 2,15,741 మంది ఓటర్లు ఉన్నారు. కమ్మ, బీసీ సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గం ఇది. బోయ సామాజికవర్గం ఓటుబ్యాంకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. విడపనకల్, వజ్రకరూర్, ఉరవకొండ, బెళుగుప్ప, కూడేరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

తెలుగుదేశం పార్టీకి గట్టిపట్టు ఉంది ఉరవకొండపై. నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి 2019 వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా ఆరుసార్లు టీడీపీ గెలవడమే దీనికి నిదర్శనం. సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నాలుగుసార్లు విజయదుందుభి మోగించారు.
నాలుగుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, రెండుసార్లు ఇండిపెండింట్లు ఉరవకొండపై జెండా ఎగురవేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా కైవసం చేసుకున్న స్థానం ఇది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున వై విశ్వేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2,275 ఓట్ల తేడాతో పయ్యావుల కేశవ్‌ను ఓడించారు.
2019 నాటికి రిజల్ట్.. రివర్స్ అయింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించారు పయ్యావుల కేశవ్. 2014 నాటి ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పయ్యావుల కేశవ్ అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది టీడీపీ అగ్ర నాయకత్వం. మరోసారి ఆయనకే టికెట్ ఇచ్చింది.
వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తెలియట్లేదు. విశ్వేశ్వర్ రెడ్డికే టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓడిపోయినప్పటికీ- నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటోన్నారు.












Click it and Unblock the Notifications