గుడివాడ క్యాసినో రగడ: కొడాలి నానిపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు
గుడివాడ క్యాసినో వ్యవహారంపై రగడ చల్లారడంలేదు. అధికార వైసీపీ, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహరం ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ వద్దకు చేరింది. టీడీపీ నిజనిర్థారణ కమిటీ నేతలు గవర్నర్‌ని కలిసారు. గుడివాడలో క్యాసినో , జూదం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. క్యాసినోకు సంబంధించిన కరపత్రాలు, వీడియోలు ఇతర ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు మంత్రి కొడాలి నాని పాల్పడ్డారని ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.

కొడాలి నాని ఒక విషపు పురుగు
గుడివాడలో వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్లిన తమపై దాడులు జరిపారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు.. మంత్రి పదవి ఊడుతుందన్న భయంతో కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కొడాని నాని ఒక విషపు పురుగని వర్లా రామయ్య దుయ్యబట్టారు. నానిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నానిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

మంత్రిని కాపాడుతున్న సీఎం జగన్..
పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ అసలు పట్టించుకోవడమే లేదన్నారు. దుర్మార్గపు మంత్రిని కాపాడాలన్నదే సీఎం ఆలోచనని అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ వ్యవస్థ గౌరవాన్నిదెబ్బ తీసేశారని వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. గుడివాడలో క్యాసినో వ్యవహరాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారు. కానీ సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం చూడలేకపోయారా అని విమర్శించారు . సాక్షాధారలతో సహా పోలీసులు ఇచ్చి, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.

డీజీపీ ఎందుకు మాట్లాడడంలేదు..
రాష్ట్రంలో వైసీపీ విష సంసృతిని పెంచిపోషిస్తోందని బోండా ఉమ దుయ్యబట్టారు. సాక్షాత్తు మంత్రులే అమ్మాయిలతో డాన్సులు, జూదాలు ఆడిస్తున్నారని విరుచుపడ్డారు. డీజీపీ ఇంతవరకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. గుడివాడ క్యాసినోపై గవర్నర్ కూడా ఫిర్యాదు చేశాం.. ఇంతటితో ఈ విషయాన్ని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కొడాలి నాని కాస్త.. క్యాసినో నానిగా మారారన్నారు.

క్యాసినోకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి..
గుడివాడలో క్యాసినోకు సీఎం జగన్ బాధ్యత వహించాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. పండగ పేరుతో చట్టానికి విరుద్థంగా గుడివాడ నడిబొడ్డులో క్యాసినో నిర్వహించారని విమర్శించారు. అక్కడ గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు కూడా జరిగాయన్నారు. కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. క్యాసినో వివాదాన్ని పక్క దోవ పట్టించేందుకు కొత్త జిల్లా అంశాలను సీఎం జగన్ తెరతీశారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications