వైయస్ దేవుడు: జగన్‌పై టిడిపికి ఛాన్స్, ముద్రగడ ఇరుకునపడ్డారా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి చాలా తేడా ఉందని.. వైసిపి నుంచి వెళ్లిపోయిన నేతలు గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా.. టిడిపి నేత బోండ ఉమ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ... వైయస్‌ను మెచ్చుకుంటున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనకు జగన్‌తో సంబంధం లేదని చెప్పారని గుర్తు చేశారు.
అంటే, జగన్ సరైన వ్యక్తి కాదని ముద్రగడ అభిప్రాయపడ్డట్లే కదా అని చెప్పారు. అదే సమయంలో మరికొందరు టిడిపి నేతలు అదే ముద్రగడ వ్యాఖ్యల్లో మరో అర్థాన్ని కూడా తీసుకు వస్తున్నారు. తనకు వైయస్ రాజశేఖర రెడ్డి దైవంతో సమానమని ముద్రగడ చెప్పారని, దాంతోనే ఆయన అభిప్రాయం ఏంటో తెలిసిపోతుందన్నారు.
తద్వారా.. వైయస్ దైవంతో సమానమని చెప్పడం ద్వారా పరోక్షంగా ఆయన జగన్‌కు మద్దతు పలుకుతున్నట్లేనని భావించవచ్చునని టిడిపి నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ మాట్లాడుతూ.. తనకు వైయస్ రాజశేఖర రెడ్డి దైవంతో సమానమని, జగన్‌తో సంబంధం లేదని చెప్పారు.

ఈ వ్యాఖ్యల ద్వారా టిడిపి నేతలు పై రెండు అంశాలను లేవనెత్తుతున్నారు. జగన్‌తో సంబంధం లేదని చెప్పడం ద్వారా ఆయన వైసిపి అధినేత తీరును ముద్రగడ చెప్పకనే చెప్పారని, అదే సమయంలో వైయస్‌ను పొగడటం ద్వారా.. జగన్‌పై పరోక్షంగా ఉన్న అభిమానాన్ని చాటారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, జగన్ నిన్నగాక మొన్న పుట్టాడని కూడా ముద్రగడ వ్యాఖ్యానించారు.
కాగా, గతంలో వైసిపి నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన వైయస్ అభిమానులు.. జగన్ పైన తీవ్ర విమర్శలు చేస్తూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎంపీ సబ్బం హరి తదితరులు జగన్ పైన అప్పుడు నిప్పులు చెరిగారు. నమ్మిన వాళ్లకు వైయస్ ఇచ్చే ప్రాధాన్యత వేరేగా ఉంటుందని, జగన్ మాత్రం అలా కాదని ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications