చింతమనేని, కొలికపూడికి తేల్చి చెప్పిన టీడీపీ హైకమాండ్...!!
తెలుగుదేశం నాయకత్వం అంతర్గత సమస్యల పరిష్కారం పైన ఫోకస్ చేసింది. స్థానిక ఎన్నికల వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తిరువూరు నియోజ కవర్గంతో పాటు దెందులూరు ఎమ్మెల్యేకు సంబంధించిన వివాదాలపై విచారణ చేసారు. ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. పార్టీ హైకమాండ్ సందేశం ఏంటో తేల్చి చెప్పారు. భవిష్యత్ లో వివాదాలు కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
టీడీపీ ఎమ్మెల్యేల వివాదాల పైన పార్టీ నాయకత్వం గుర్రుగా ఉంది. తిరువూరు ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో చిక్కుకోవటం పైన సీరియస్ అవుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు కు గతంలోనే హెచ్చరికలు చేసినా... వివాదాలు కొనసాగటం పైన వివరణ కోరింది. తిరువూరు నియోజకవర్గంతో పాటు దెందులూరు ఎమ్మెల్యేకు సంబంధించిన వివాదాలపై కొలికపూడితో పాటు గా చింతమనేని ప్రభాకర్ తోనూ పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి, వారి నుంచి వివరణ కోరారు. ముందుగా, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మధ్య తలెత్తిన విభేదాలపై పల్లా శ్రీనివాసరావు ఆరా తీశారు. ఇరువురితో విడివిడిగా సమావేశమై, వారి మధ్య ఉన్న పరస్పర ఆరోపణలు, పార్టీకి అందిన ఫిర్యాదులపై సమగ్రంగా చర్చించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను సామరస్యపూర్వ కంగా పరిష్కరించుకోవాలని, అనవసర వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని వారికి స్పష్టం చేసారు. వివాదాలు కొనసాగితే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పినట్లు సమాచారం.

స్థానిక ఎన్నికల వేళ పార్టీ నాయకత్వం అప్రమత్తం
అదే విధంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వచ్చిన టోల్‌ప్లాజా ఘటన ఆరోపణలపైనా పల్లా శ్రీనివాసరావు విచారణ జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను చింతమనేని ప్రభాకర్‌ని అడిగి తెలుసుకున్నారు. టోల్‌ప్లాజా సిబ్బంది, లారీ డ్రైవర్లు అందించిన సమాచారం పైనా చర్చించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను పల్లా శ్రీనివాసరావు సేకరించారు. వ్యక్తిగత విమర్శలకు లోనుకాకుండా పార్టీ క్రమశిక్షణను, ఐక్యతను కాపాడాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని స్పష్టం చేశారు. కూటమిగా కొనసాగుతున్న సమయంలో ప్రతీ విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని... ఏ ఒక్కరికీ నష్టం లేకుండా వ్యవహార శైలి ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికీ వివాదాలు కొనసాగితే పార్టీ ఉపేక్షించేది లేదని.. చర్యలు తప్పవని తేల్చి చెప్పినట్లు సమాచారంజ













Click it and Unblock the Notifications
