హద్దు మీరితే ఎక్కడికి అయినా వచ్చి.. బోండా ఉమా హెచ్చరిక..!!
విజయవాడ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. టీడీపీ.. వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మారి పోతున్నాయి. హెచ్చరికలు.. ఉద్రిక్తత వరకు వెళ్తున్నాయి. డీఎస్సీ అక్రమాల పైన వైసీపీ చేస్తున్న నిరసనల పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలకు హెచ్చరికలు చేస్తున్నారు. వైసీపీ నేతలు సైతం ఇదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా క్రిష్ణా జిల్లా వైసీపీ నేతల కు హెచ్చరిక చేసారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల అంశాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. నిరసనల పేరుతో రోడ్డెక్కి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తన పైన చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. తాము అనుకుంటే వైసీపీ నేతల బతుకు ఎంత అని ప్రశ్నించారు. తాను రౌడీయిజం చేస్తే వైసీపీ నేతలు రోడ్ల పైన తిరగగలరా అని వ్యాఖ్యానించారు. నోరు పారేసుకుంటే మాత్రం ఎక్కడికైనా వస్తాం.. సంగతి తేలుస్తామని వైసీపీ నేత పేర్నినానిని ఉద్దేశించి హెచ్చరించారు. పద్ధతి తప్పినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ పెద్దలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర భాష వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బొండా ఉమ స్పష్టం చేశారు.

విజయవాడలో దేవినేని అవినాశ్, వెల్లంపల్లి, మల్లాది విష్ణును పక్కన పెడితేనే వైసీపీకి మనుగడ ఉంటుందని చెప్పుకొచ్చారు. అవినాశ్ రౌడీలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తనకు టిక్కెట్ రాదని చెప్పటానికి మీరెవరని వైసీపీ నేతలను ప్రశ్నించారు. విమర్శలు ఏవైనా హుందాగా ఉండాలని హితవు పలికిన బొండా ఉమ, హద్దు మీరి నోరు పారేసుకుంటే మాత్రం తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇకపై తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఎక్కడికైనా వచ్చి తగిన విధంగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. తన రాజకీయ భవిష్యత్తు, ఎన్నికల టికెట్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని, పార్టీ అధినేత నిర్ణయం మేరకే అన్నీ జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉంచామని పేర్కొన్నారు.




Click it and Unblock the Notifications