అమ్మఒడి పథకం, జగన్ నిర్ణయాలను ప్రశంసించిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల్లో ఒకటి- అమ్మఒడి. తమ పిల్లలను ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పేద కుటుంబాలకు చెందిన తల్లులకు ఆర్థికంగా చేయూతను అందించడానికి రూపొందించిన పథకం ఇది. ఈ పథకం కింద 15,000 రూపాయలను ప్రభుత్వం అందజేస్తోంది.
ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులందరికీ అమ్మఒడి పథకాన్ని వర్తింపజేసింది. ఈ పథకం కింద మంజూరయ్యే నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తోంది జగన్ సర్కార్. నేరుగా తల్లుల ఖాతాల్లోకే ఈ మొత్తాన్ని విడుదల చేయడం వల్ల- పాఠశాలలకు ఆ మొత్తాన్ని చెల్లించే సమయంలో అక్కడి వసతుల గురించి ఆరా తీయడానికి వీలు కలుగుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం.

ఈ పథకం వల్ల పాఠశాలల్లో డ్రాపౌట్స్ భారీగా తగ్గాయి. అదే స్థాయిలో అడ్మిషన్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోన్నాయి. సీట్లు ఖాళీ లేవంటూ బ్యానర్లు వెలిసే పరిస్థితి ఏర్పడిందంటే- ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఏ స్థాయిలో చోటు చేసుకుంటోన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సైతం మార్చివేసింది ప్రభుత్వం. కార్పొరేట్ స్థాయికి వాటిని తీర్చిదిద్దింది.
జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న అమ్మఒడి పథకం అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని సైతం ఆకర్షిస్తోంది. విద్యపై వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేయడాన్ని టీడీపీ నాయకులు స్వాగతిస్తోన్నారు. తాజాగా- పాలకొల్లుకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు ఈ జాబితాలో చేరారు. విద్యపై ప్రభుత్వం ఖర్చు చేయడం మంచిదేనని వ్యాఖ్యానించారు.
ప్రత్యేకించి- అమ్మఒడి పథకాన్ని ఆయన ప్రశంసించారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమ్మఒడి.. చాలామంచి పథకం అని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అంటే జులైలో ఈ మొత్తాన్ని మంజూరు చేయడం మంచి నిర్ణయం అని పేర్కొన్నారు. ఏడాది మొదట్లోనే దీన్ని విడుదల చేస్తే- తల్లులు ఇతరత్రా అవసరాల కోసం వాటిని మళ్లించే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరం ప్రారంభంలో విడుదల చేయడం మంచిదేనని చెప్పారు.
అమ్మఒడి కింద విడుదల చేస్తోన్న మొత్తాలను విద్యార్థుల ఖాతాల నుంచి నేరుగా పాఠశాలలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల విద్యాసంస్థల యాజమాన్యంపై మరింత బాధ్యత పెరుగుతుందని, నేరుగా ప్రభుత్వమే నిధులను విడుదల చేయడం వల్ల వారికీ న్యాయం చేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామానాయుడు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications