Raghurma: జగన్ తిరుమల దర్శనానికి రఘురామ కండిషన్లు ఇవే..!
ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ విపక్ష నేత వైఎస్ జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే గతంలో సీఎంగా ఉన్నప్పుడు దర్జాగా ఎలాంటి డిక్లరేషన్ లేకుండా అన్యమతస్తుడైన జగన్ తిరుమల వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్ధితి వేరు. అసలే లడ్డూ వివాదం కాకరేపుతోంది. ఇలాంటి సమయంలో డిక్లరేషన్ లేకుండా తిరుమలకు ఎలా వెళ్తావో చూస్తాం అంటూ కూటమి నేతలు హుంకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే, జగన్ పాత ప్రత్యర్థి రఘురామ కూడా స్పందించారు.
తిరుమలకు వచ్చేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలపై స్పందించిన రఘురామ.. ఆయనకు పలు కండిషన్లు పెడుతున్నారు. ముఖ్యంగా అన్యమతస్తుడైన జగన్ హిందూ మతం పట్ల విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నారు. అలాగే లడ్డూ వివాదం నేపథ్యంలో పాప పరిహారం కోసం జగన్ చెంపలేసుకుని, తిరుపతి లడ్డూ వాసన చూసి వదిలేయకుండా నిండు విశ్వాసంతో దాన్ని తినాలన్నారు. ఈ కండిషన్లు పాటించి ఆయన దర్శనానికి వెళ్లాలని కోరారు.

తిరుమల లడ్డూను కల్తీ చేసిన జగన్ ను స్వామి వారు పాప పరిహారం కోసం తిరుపతికి పిలిపించడం పట్ల రఘురామ సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అందరితో కలిసి స్వీకరించాలని జగన్ కు ఆయన సూచించారు. ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ ప్రసాదం ఎంతో నాణ్యంగా ఉందని కూడా తెలిపారు. భక్తులు కూడా లడ్డూ ప్రసాదంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రఘురామ సూచించారు. లడ్డూ ప్రసాదంపై వివాదం వేళ రఘురామతో పాటు ఇతర కూటమి నేతలు కూడా జగన్ పై సెటైర్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications