చంద్రబాబు సర్వే లెక్క తప్పింది : ఎమ్మెల్యేల్లో తప్పుడు రిపోర్టుల కలవరం
విజయవాడ : అయితే ప్రభుత్వం గురించి సర్వే.. లేదంటే.. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే.. మొత్తంగా ప్రభుత్వ పనితీరుని, ఎమ్మెల్యేల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సర్వేను ముందేసుకుంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే మొన్నటి సీల్డ్ కవర్ సర్వే ద్వారా.. పార్టీ ఎమ్మెల్యేల బలాలు, బలహీనతలను అంచనా వేశారు.
అయితే.. సర్వేకు సంబంధించి ఎక్కడో లెక్క తప్పింది అన్న వాదనలు పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. సీల్డ్ కవర్ లో పొందుపరిచిన పలు విషయాల్లో.. వాస్తవానికి విరుద్దంగా రిపోర్టులు ఉన్నాయంటూ పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబును ఆశ్రయిస్తున్నారు. సీల్డ్ కవర్ లో పొందుపరిచిన అంశాలను ఆధారంగా చేసుకునే ఎమ్మెల్యేలకు గ్రేడ్ లు ప్రకటించిన నేపథ్యంలో.. తమపై ఇచ్చిన తప్పుడు రిపోర్టులను సరిదిద్దుకొని గ్రేడును మెరుగుపరుచుకోవాలని యోచిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు.
ఈ తప్పుడు రిపోర్టుల జాబితాలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడన్న పేరు హనుమంతరాయ చౌదరికి ఉండగా.. సర్వేలో మాత్రం అసలాయన నియోజకవర్గంలో కనిపించరని పేర్కొన్నారట. దీంతో సర్వేలో తప్పులు దొర్లాయని హనుమంతరాయ చౌదరి వర్గీయులు వాపోతున్నట్లుగా సమాచారం.

ఇక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విషయంలోను ఇలాంటి తప్పిదమే చోటు చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ తన నియోజకవర్గ ప్రజలను వెంటేసుకుని తిరిగే రామ్మోహన్ పై ఇలాంటి రిపోర్టును వారంతా తప్పుబడుతున్నట్లుగా తెలుస్తోంది. రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధ జడ్పీటీసీ చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ.. జడ్పీ నిధులు తీసుకురావడంలో గద్దె విఫలమవుతున్నారంటూ సర్వే రిపోర్టులో పొందుపర్చాట.
అయితే ఇక్కడ గమనించాల్సి విషయమేంటంటే.. జిల్లా పరిషత్ నిధులను గ్రామాలకు తప్ప నగరాలకు మంజూరు చేయరు. ఇలాంటి పొరపాట్లతో తమ బలాలు బలహీనతలను బేరీజు వేయడం పట్ల ఆయా నేతలు అసంతృప్తితో ఉన్నారన్న వాదన కూడా లేకపోలేదు. పైగా.. 2019 ఎన్నికలకు ఈ సర్వేలనే సాక్ష్యంగా చూపి ఎక్కడ టికెట్ ఇవ్వకుండా దూరం పెడుతారోనన్నది మరికొంత మంది ఎమ్మెల్యేల ఆవేదన.
ఇలా.. రిపోర్టుల్లో తప్పులు దొర్లినట్టు గుర్తించిన ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం చంద్రబాబు వద్దకు క్యూ కట్టారు. సర్వేలో దొర్లిన తప్పుల గురించి చంద్రబాబుకు వివరిస్తూ.. తమ పనితీరు గురించి వెల్లడించుకుంటున్నారట. దీంతో సర్వేలో పొందుపరిచిన అంశాలు వాస్తవాలకు విరుద్దంగా ఉంటే.. ఎవరి పనిపై వారు మరింత శ్రధ్ద పెట్టి పనిచేస్తే మేలని చంద్రబాబు సూచిస్తున్నారట. ఏదేమైనా చంద్రబాబు సీల్ద్ కవర్ సర్వే లెక్క తప్పిందన్న వాదనలు ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట.












Click it and Unblock the Notifications