తుఫానొస్తే మునిగిపోయే విశాఖ: రాయపాటిపై టిడిపి ఎమ్మెల్యేల ధ్వజం
విశాఖపట్నం: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మండిపడ్డారు. తుఫానొస్తే మునిగిపోయి, గాలొస్తే ఎగిరిపోయే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎందుకని రాయపాటి చేసిన వ్యాఖ్యలపై విశాఖ పశ్చిమం శాసనసభ్యుడు గణబాబు మండిపడ్డారు.
విశాఖ రైల్వే జోన్ అవసరం గురించి రాయపాటికి ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. రైల్వే జోన్ పేరిట ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే సహించబోమని ఆయన అన్నారు. గోపాలపట్నంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

రాయపాటి వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజలను బాధపెట్టే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. భువనేశ్వర్ కేంద్రంగా దక్షిణ మధ్య, ఈస్ట్ కోస్ట్ రైల్వేలు ఉన్నా విశాఖ డివిజన్ నుంచి తొంబై శాతం రైల్వేకి ఆదాయం వస్తోందని ఆయన చెప్పారు.
విశాఖకు రైల్వే జోన్ వద్దని రాయపాటి సాంబశివ రావు చేసిన వ్యాఖ్యలను మరో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ మూర్తి వ్యతిరేకించారు. శుక్రవారం పెందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయపాటి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications